చర్చల ద్వారా వివాదాల పరిష్కారం
డ్యూటస్చ్ బ్యాంకు, జపాన్ సంస్థ సొజిత్ కార్పొరేషన్‌తో కోర్టులో కొనసాగుతున్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు పృధ్వి ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పిఐఎస్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి సతీష్ కుమార్ వ్యాఖ్యానించారు. తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను పాటించకుండా 200 కోట్ల రూపాయల మేరకు మోసం చేశారంటూ సొజిత్ సంస్థ హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ కోర్టులో వేసిన క్రిమినల్ కేసుపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. 2007-08లో హ్యూయ్ టెక్నాలజీస్ నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌కు వివిధ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును పృధ్వి కుదుర్చుకుందని, ఈ దిశగా చెల్లింపుల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎస్క్రో ఎకౌంటును సైతం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఇచ్చిన ఆర్డర్ విలువ 226 కోట్ల రూపాయలని, సొజిత్ కాంట్రాక్టు విలువ 193 కోట్ల రూపాయలని వివరిస్తూ, సొజిత్ తప్పుడు డాక్యుమెంటేషన్‌కు పాల్పడిందన్న ఆరోపణల మధ్య డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డిఆర్‌ఐ) విచారణ జరిపి ఆ పరికరాలను సీజ్ చేసిందని తెలిపారు. దీనివల్ల తమ కస్టమర్ బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి పేమెంట్స్ రికవరీ చేయడంలో చాలా ఆలస్యం జరిగిందని, తమకు 97 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సతీష్ వివరించారు. ఈ వ్యవహారాన్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నామని తెలిపారు. సొజిత్‌కు తాము ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటికీ పిఎస్‌ఐఎల్ ఎకౌంట్లలో ఉన్నదని ఆయన వివరించారు. అంతకుముందు సొజిత్ సెక్షన్ 420 (చీటింగ్), క్రిమినల్ కాన్స్పిరసీ 120-బి చట్టాల కింద తమకు బిల్లులు చెల్లించకపోవడాన్ని కార్పొరేట్ ఫ్రాడ్‌గా చూపుతూ కేసు దాఖలు చేసింది. కాగా, బెంగుళూరులో డ్యూటస్చ్ బ్యాంకు ఒక సివిల్ కేసును సంస్థపై దాఖలు చేసింది. తమ నుంచి రుణాలు తీసుకోవడానికి తప్పుడు ప్రజంటేషన్స్ ఇచ్చారన్నది డ్యూటస్చ్ వాదన. దీనిపై ఉప్పలపాటి వివరణ ఇస్తూ, ఈ కేసులో నోటీసులు అందాయని, ఏప్రిల్‌లో హియరింగ్‌కు వస్తుందని భావిస్తున్న కేసును అంతకుముందే కోర్టు బయట పరిష్కరించుకుంటామన్న నమ్మకముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ న్యాయ సలహాదారులు ఎంవి రావు, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




