దొంగలపాలైన పురాతన రాతిమంచం
నాటి శిల్పుల కళాచాతుర్యాన్ని చాటిచెప్పే మండలంలోని 75 వీరాపురంలో ఉండే రాతి మంచం కోళ్లు మంగళవారం అర్ధరాత్రి దొంగలపాలయ్యింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా రాతి మంచం దొంగల పాలుకావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల క్రితం రాయదుర్గం చరిత్రకారుడు జయసుమన్ అక్కడ వెలసిన శిలాశాసనం ద్వారా ఈ అపురూప రాతిమంచం 15వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించి వెలుగులోకి తెచ్చారు. నాటి నుంచి రాతి మంచాన్ని పరిరక్షించాలంటూ పురావస్తుశాఖ అధికారులను, జిల్లా అధికారులను ఆయన మొరపెట్టుకుంటూ వచ్చారు. దీంతో ఈ విషయం తెలిసిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాతి మంచం ధ్వంసం కావడం వల్ల గ్రామానికి కీడు జరుగుతుందనే సందేహంతో 75 వీరాపురం గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బండెప్ప స్వామి ఆలయం పక్కన వెలసిన రాతి మంచం వల్ల గ్రామంలో ప్రజలు సుఖశాంతులతో జీవించడమే కాకుండా పంటలు ససశ్యామలంగా పండేవని, ప్రస్తుతం రాతి ధ్వంసం కావడంతో గ్రామానికి ఎటువంటి కీడు సంభవిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శిలా మంచమును ఇక్కడి గ్రామస్థులు బండెప్ప మంచమని పిలువబడుతోంది. రాతి మంచం పొడవు ఆరు అడుగులు ఉండగా వెడల్పు నాల్గున్నర అడుగులు, మందం ఆరు ఇంచులు ఉంటుంది. అలనాటి శిల్పు చాటిచెప్పే విధంగా ‘లత’తీగ గుర్తులు, నాల్గువైపుల రాతి తలదిండ్లు, మంచానికి కింది బాగాన మూడు పుష్పములు, మధ్య గల పుష్పానికి నాలుగువైపుల నాగసర్పం పడగ గుర్తులు, మిగిలిన రెండు పుష్పాలకు నాలుగువైపుల రామచిలక గుర్తులు మలచబడి చూపరులకు ఆకర్శిస్తుంది. దొంగలపాలైన రాతి మంచం కోళ్లుపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ ఐ హనీఫ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.




