బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన వర్గాలకు అభినందన – ఆలయ కమిటీ
ఖాద్రి లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా విజయ వంతంగా నిర్వహించడానికి సహకరించిన వివిధ శాఖల అధికారులను,సిబ్బందిని ఆలయ పాలక కమిటి శనివారం నిర్వహించిన సమావేశంలో అభినందనలతో ముంచెత్తారు.ఈ సందర్భంగా ఆలయ పాలక కమిటి అద్యక్షుడు ఎస్.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా పక్షం రోజుల పాటు అహర్నిశలు నిద్రాహారాలుమాని విధినిర్వహణలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించి బ్రహ్మోత్సవాలు విజయ వంతం కావడానికి కృషిచేసిన కదిరి డి.ఎస్పీ సుబ్బరాయుడు అద్వర్యంలో భద్రతా చర్యలను చేపట్టిన పట్టణ సి.ఐ మున్వర్ హుస్సేన్,ఎస్సై జాకీర్ హుస్సేన్‌లో సహా బ్రహ్మోత్సవాలలో భద్రతా విధులలో పాల్గొన్న వారిని పేరుపేరున పాలక మండలి అద్యక్షుడు తమ అభినందనలను పాలక మండలి తరుపున తెలిపారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది,ట్రాన్స్‌కో సిబ్బంది,రెవెన్యూ యంత్రాంగం అందించిన సేవలను ఆయన కొనియాడారు.బ్రహ్మరథోత్సవ సందర్బంగా ఆనవాయితీగా హాజరయ్యే మూర్తిపల్లే,నాగిరెడ్డిపల్లి,కుటాగుళ్ల ప్రాంతాల యువత సేవలను ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా డి.ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా హాజరైన భక్తజనానికి ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా,భద్రతా చర్యలలో పాల్గొన్న పోలీసు శాఖ అధికార యంత్రాంగ సేవలు సక్రమంగా నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.బ్రహ్మోత్సవాలలో బ్రహ్మరథోత్సవ సందర్బంగా సుమారు 6లక్షల మంది భక్తజనం హాజరై ఉంటారని ఆయన అంచనాగా పేర్కొన్నారు.కనీవినిఎరుగని రీతిలో అశేష సంఖ్యలో హాజరైన భక్తజనాన్ని ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా నియంత్రించడంలో పోలీసు శాఖ చూపిన ప్రతిభపై ఆయన ప్రశంశలు కురిపిస్తూ తమ పాట్లు ఎలా ఉన్నా సేవా భావంతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మండుటెండను సైతం లెక్కచేయకుండా మూర్తిపల్లె,నాగిరెడ్డిపల్లి,కుటాగుళ్ల ప్రాంత యువత తెడ్లు వేస్తూ సాహసోపేతంగా తేరు నడవడానికి చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.ఖాద్రీ నృసింహుడి పై ఉన్న భక్తి భావంతో ఆ ప్రాంతాల యువత తెడ్లు వేసే సమయంలో ప్రమాదానికి గురైనా మనోధైర్యాన్ని కోల్పోకుండా లక్షలాది మంది భక్తజనం చూసి తరించాలనే దృడ అభిప్రాయంతో సహచరులు గాయాలపాలైనా తెడ్లను వేయడం ఆపకుండా తేరు పూర్వపు స్థానం చేరేవరకు త్రికరణ శుద్దితో శ్రమించిన తీరు తనను ఆకట్టుకొందని తెడ్లు వేసే యువత పై ప్రశంశల జల్లును కురిపించారు.మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్ పార్ధసారధి మాట్లాడుతూ భారత దేశంలోనే బరువైన కదిరి బ్రహ్మరథం(తేరు)లాగడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు.లక్షలాది మంది అశేష భక్తజనం హాజరై బ్రహ్మరథోత్సవ వేడుకలను వీక్షించారని తేరును లాగిన వారి సంఖ్య పరిమితంగా ఉంటుందన్నారు.అధిక బరువైన తేరు కదలడానికి తెడ్లు వేస్తూ సాహసోపేతంగా ముందుకు కదలడానికి కృషిచేసే మూర్తిపల్లే,కుటాగుళ్ల,నాగిరెడ్డి పల్లి ప్రాంతాల యువతదే కీలక పాత్రగా ఆయన అభివర్ణించారు.గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో అశేష భక్తజనం మండుటెండను సైతం లెక్కచేయకుండా హాజరై ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తమ స్వస్థలాలకు చేరుకొనడంలో సహకరించిన వివిధ వర్గాల అధికార యంత్రాంగాలకు ఆయన తన అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా తేరుకు తెడ్లు వేసే సమయంలో విధినిర్వహణలో గాయపడిన యువతకు బి.జె.పి జిల్లా అద్యక్షుడు పూల మాలలు వేసి తన అభినందనలు తెలిపారు.అనంతరం గాయపడిన వారికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇ.ఓ యానాదిశెట్టి,తహసిల్దార్ మోహన్,మున్సిపల్ కమీషనర్ పెంచలయ్య,బోయహక్కుల పోరట కమిటి జిల్లా ఉపాద్యక్షులు బైబిల్ గంగన్న,నాయకులు నాగరాజు,తలుపుల గంగాధర్,చల్లా వెంకటరమణ,గంగయ్య,పి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.




