సాగునీటి యాజమాన్యంలో రైతులకు భాగస్వామ్యం
సాగునీటి యాజమాన్యంలో రైతులను భాగస్వాములను చేయాలని పరిశ్రమల అభివృద్ధి, జనాభా పెరుగుదల, నీటి వినియోగ సామర్ధ్యాన్ని 60 నుంచి 75 శాతం వరకు పెంచాలని కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ ఎ.కె. బజాజ్ అన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ నీటి యాజమాన్య పథకం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాలలోని ఆడిటోరియంలో సుస్థిర సాగునీటి వ్యవసాయానికి భూమి, నీటి ఉత్పాదకత పెంపు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎ.కె. బజాజ్ మాట్లాడుతూ, నానాటికీ జనాభా పెరిగిపోతున్న దృష్ట్యా తలసరి నీటి లభ్యత తగ్గిపోతుందన్నారు. భవిష్యత్తులో తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. సహజవనరులలో అత్యంత విలువైన జల వనరులు వృధా అవుతున్నాయని, సరైన విధంగా సాగునీరందక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సక్రమంగా నీటి పంపిణీ విధానం సమర్ధవంతమైన నీటి పారుదల వ్యవస్థకోసం ప్రణాళిక రూపొందించు కోవాలన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నీటి ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని నీటి యాజమాన్యంలో రైతులను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. సంప్రదాయక ఎరువుల వాడకం వల్ల భూసారం పెరుగుతుందని చెప్పారు. రైతులు బోర్‌వెల్స్ వేసేటపుడు శాస్త్రీయ పద్దతులు పాటించాలని లేకుంటే భవిష్యత్తులో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయని ఆయన హెచ్చరించారు. నదీ పరీవాహక ప్రాంతాలు కబ్జాకు గుకురవుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎ.పి.డబ్ల్యు.ఎ.ఎం ప్రాజెక్టు సాంకేతిక బులిటెన్‌ను ఆయన ఆవిష్కరించారు. బూటాన్, భారత ప్రభుత్వ ఎఫ్.ఎ.ఓ ప్రతినిధి గావెన్ లిన్‌సేవాల్ మాట్లాడుతూ, రైతులకు, నీటి పారుదల రంగం ఇంజనీర్లకు సాంకేతిక పరంగా పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందన్నారు. కర్నాటక ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఎం.డి డి. సత్యమూర్తి మాట్లాడుతూ, సాగునీటి యాజమాన్యం నిర్వహణ పెద్ద చాలెంజ్ అన్నారు. ప్రభుత్వ పథకాలను పరిశీలించే విషయంలో రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంకేతిక కోణాల్లో పరిశీలించాలని అన్నారు. చిన్నకారు రైతులకు కలిగే మేలును దృష్టిలో వుంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసినపుడు కాల్వల దిగువ ప్రాంతాల భూములకు నీరందడంలేదన్నారు. ఎగువ ప్రాంత రైతులు ఇష్టానుసారంగా నీటిని వినియోగించుకుంటున్నారని, వారిని కంట్రోల్ చేయడం కష్టమన్నారు. అందుకే నీటి పంపిణీలో ఖచ్చితమైన పద్దతులు అవలంభించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడితే వెంటనే దిగుబడి కనిపించదని, ఇది ధీర్ఘకాలంలో మరింత ఫలితాలను ఇస్తుందని చెప్పారు. బి.టి విత్తనాల మూలంగా మల్టీ క్రాప్ సిస్టమ్ దెబ్బతింటుందన్నారు. కర్నాటకలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆయన సుధీర్ఘంగా వివరించారు. పి.డి.కె.వి. అకోలా వైస్‌ఛాన్సలర్ వి.ఎం. మోయాన్డే మాట్లాడుతూ, నీటి వనరులను, మురుగునీటి నిర్మూలనను సరైన రీతిలో వినియోగించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఆయకట్టు అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ ఐ.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రస్తుతం 1500 కోట్ల రూపాయలను ఈ రంగానికి కేటాయించిందన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నీటి పారుదల రంగానికి 40 వేల కోట్లరూపాయలు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. నెదల్‌ర్లాండ్స్ చీఫ్ టెక్నికల్ అడ్వైజర్ బూన్‌స్ట్రా మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంలో సాంకేతిక అంశాలను ఎందుకు వాడుకోవడంలేదో శాస్త్రవేత్తలు కనుక్కోవాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలు గ్రామస్థాయిలో రైతులకు అందాల్సిన అవసరం వుందన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు విఫలమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ, సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని నీటి యాజమాన్య సంస్థ సాంకేతిక పరిశోధనల గురించి ఆయన వివరించారు. ఐ.సి.ఐ.డి సెక్రెటరీ జనరల్ గోపాలక్రిష్ణన్ మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాను దృష్టిలో వుంచుకుని భూమి, నీటి ఉత్పాదకత పెంచే అవసరం ఎంతో వుందని చెప్పారు. ఈ సదస్సులో ప్రాజెక్టు మేనేజర్ యల్లారెడ్డి, ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాల. రీసెర్చ్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




