టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి – డీఆర్వో
మార్చి 22 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగు 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి హేమసాగర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం డిఆర్వో చాంబర్‌లో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 40486 మంది 10వ తరగతి పరీక్షలు వ్రాయబోతున్నారని అందులో 35398 మంది రెగ్యులర్ కాగా, 5088 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని వీరందరికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆర్థిక సంఖ్యలో పరీక్షలు వ్రాస్తున్నందున 196 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో రెగ్యులర్ కేంద్రాలు 171, ప్రైవేట్ 25, జిల్లాలో పరీక్షా కేంద్రాలను 64 జోన్‌లుగా విభజించామని డిఇవో శ్రీనివాసరావు డిఆర్వోకు వివరించారు. అలాగే ప్రశ్నా పత్రాలను భద్ర పరచేందుకు 53 పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్లైయింగ్ స్క్వాడ్‌గా 10 మంది తహసీల్దార్లు, టాస్క్ పోర్స్ అధికారులుగా తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఎస్‌ఐలు ఉంటారన్నారు. డిఆర్వో మాట్లాడుతూ పరీక్షలు జరుగు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగిన అనంతరం జవాబు పత్రాలను మధ్యాహ్నం 3గంటల లోపు పంపేందుకు పోస్టల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నా పత్రాలు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అవసరమైన బెలడోనా పిల్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం కడపలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని ఏవైన సమస్యలేర్పడితే 08562-244869 నెంబర్‌కు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఇవో శ్రీనివాసరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి, ఆర్టీసి ఆర్‌ఎం చంద్రశేఖర్, జిల్లా ఖజానాధికారి నాగేశ్వరరావు, డిఎస్పీ సుబ్బారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖతరపున ఉమామహేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.




