రాజోలిపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ

రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణంపై ప్రభుత్వ దాగుడు మూతలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే మూడు పర్యాయాలు అధికారుల సమావేశం వాయిదా పడినా చివరకు సోమవారం జరిగిన సమావేశంలో రాజోలిపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ నియమకం జరిగింది. కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈనెల 11,12 తేదీల్లో ముఖ్యమంత్రి రోశయ్యతో సమీక్షించాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికొచ్చారు. పరిశీలన పేరుతో కమిటీ ఏర్పాటు చేయడంపై కెసికెనాల్‌ ఆయకట్టుదారుల్లో తీవ్ర అగ్రహం వ్యక్తమవుతోంది.  రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని గత ఏడాది డిసెంబర్‌23న ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి రూ.271 కోట్లను కేటాయించింది. మరోసటి రోజే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌.రాజశేఖరరెడ్డి రిజర్వాయర్‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. దీనిపై కొంత వివాదం నెలకొనడంతో పరిస్థితిని సుదీర్ఘంగా చర్చించేందుకు ఇప్పటికే అధికారులు మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. జిల్లాకు చెందిన అధికారులు హాజరు కాలేదని ఒకమారు, ఎటువంటి కారణాలు లేకుండానే మరోసారి వాయిదా వేశారు. తిరిగి ముచ్చటగా మూడవసారి సమావేశమై చర్చించినా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా సోమవారానికి వాయిదా వేశారు. దీంతో జలసౌదాలో జరిగిన సమావేశంలో మైనర్‌ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి టక్కర్‌ ఆదేశాల మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.  సిఇ ఎవిఎస్‌.రాజ, మైనర్‌ఇరిగేషన్‌ సిఇ సీతారామయ్య, ప్రాజెక్టుల సిఇ మసూద్‌ఆలంతో ప్రత్యేక త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి రాజోలి నిర్మాణానికి ఎంత నిధులు అవసరం?, నిర్వాసితులకు ఎంత చెల్లించాల్సి వుంది? వంటి వాటిపై నివేదిక సిద్ధం చేయాలని టక్కర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 11,12 తేదీల్లో ముఖ్యమంత్రి రోశయ్యకు పవర్‌పాయింట్‌తో వివరించనున్నారు. తరువాత ఆయన ఆదేశాల మేరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ కమిటీ నియామకంతో రాజోలి నిర్మాణంపైనే అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తరువాతనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.271 కోట్లు, నిర్వాసితులకు రూ.400కోట్లు అవసరమని సర్కార్‌ బావించింది. తరువాతనే డాక్టర్‌ వైయస్‌ శంఖుస్థాపన చేశారు. కానీ తిరిగి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో త్రిసభ్యకమిటీని నియమించారు.

Leave a Reply