తెలుగుగంగ పంట కాలువ పనుల్లో నాణ్యత లోపం
తెలుగుగంగ ప్రధాన కాలువ 36వ బ్లాక్ నుంచి పంట కాలువ పనుల్లో నాణ్యత లోపం కళ్ళముందే కనిపిస్తున్నా సంబంధిత తెలుగుగంగ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ కాంట్రాక్టర్లకు చేతివాటం ఇస్తున్నారు. ఈ వైనం మండల పరిధిలోని చింతలచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు 36వ బ్లాక్‌లో పంటకాలువకు సంబంధించిన సూపర్ స్టక్చర్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు 1:3:6 ప్రతిపాదనలు ఉంటే ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకంగా తిలోదకాలు పలికి నాణ్యతా లోపంతో పనులు చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడేందుకు ఎంపి ఎస్పీవైరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పనులు చేపట్టుతుంటే అందుకు భిన్నంగా కాంట్రాక్టర్లు చేతి వాటం చూసుకోవాలన్న ఉద్దేశ్యంతో సగంబస్తా సిమెంట్‌కు గానూ 10 గంటల ఇసుక, 14 గంటల పెద్దకంకర వేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 ఎంఎం కంకరతో పనులు చేయాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే కాకుండా రైతులకు ఉపయోగపడే ఈ స్టక్చర్‌లో నాణ్యత లోపించడంతో అనతి కాలంలో ఇవి శిధిలావస్థకు చేరుకొని రైతులకు ఉపయోగపడకుండా పోతుందని విమర్శలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్ ఎంపి నియామకం చేయడంతో అధికారులు సైతం అతనికి భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇతను ఉపయోగించే వాహనాల్లోనే అధికారులు పర్యవేక్షిస్తున్నందున చూసిచూడనట్లు వ్యవహరిస్తూ అందుకు సంబంధించిన నిధులను కూడా డ్రా చేస్తున్న వైనం ఉంది. కొసమెరపు ఎమిటంటే ఎంపి ఈ శాఖలో ఇద్దరి వ్యక్తులకు అధనపు జీతం ఇస్తున్నందున ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపి స్పందించి సక్రమంగా పనులు జరిగేలా చూడాలని చింతలచెరువు గ్రామ రైతులు కోరుతున్నారు. మండల పరిధిలో పలు చోట్ల ఎంపి పనులు చేస్తుండగా పై వ్యక్తి ఇలాగే వ్యవహరిస్తుండటం కొసమెరుపు.




