రక్షిత మంచినీరు మిథ్యే

అతిసార ప్రాణాలు తీస్తోంది. రక్షిత మంచినీరు లేక గ్రామాలు విలవిల లాడుతున్నాయి. పలు గ్రామాల్లో తాగునీటిని అందించే పటిష్టమైన రక్షిత మంచినీటి పథకాలు లేకపోవడంతో గ్రామీణులు వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న పారిశుధ్ద్యలోపం, పైపులైనుల లీకేజి, కలుషిత నీటి వాడకం వంటి వాటితో అతిసార ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వేలాది మంది కలుషిత నీటి తాకిడికి మంచాన బారిన పడి వైద్యం కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం అతిసార వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండు పదులకు దాటింది. ఇటీవల పత్తికొండ మండలంలోని పందికోనలో పారిశుద్ద్యం లోపంతో అతిసార ప్రబలి ఇద్దరు మృతిచెందారు. అలాగే కౌతాళం గ్రామంలో కలుషిత నీరు తాగి 60 మందికి పైగా ప్రజలు అతిసార వ్యాధి బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని చాగలమర్రి, కోసిగి మండలంలోని చింతకుంట, ఐరన్‌గల్‌ తదితర గ్రామాల్లో అతిసార వ్యాధి బారిన పడి గ్రామంలో అనేక మంది రోగానపడ్డారు. ఇదిలా ఉండగా జిల్లాలో వర్షాకాలం మొదలైంది మొదలు గ్రామాలు ఒక్కక్కటి అతిసార వ్యాధి బారిన పడుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్లైనా లేదు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెబుతున్నా గ్రామస్థాయిలో ఎలాంటి ప్రభావం కన్పించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా నందికొట్కూరు మండల పరిధిలోని బిజనవేముల గ్రామంలో కలుషిత నీరు తాగి దాదాపు 70 మంది అతిసార వ్యాధిబారిన పడ్డారు. గ్రామానికి మంచినీటిని సరఫరా చేస్తున్న పైపులైను మురికి కాలువలో లీకేజి కావడంతో నీరు కలుషితమైనట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 35మంది వాంతులు, వీరేచనాలతో మంచం పట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శివశంకర్‌ రెడ్డి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుధ్ద్యలోపం ,పైపుల లీకేజి వంటి కారణాలతో అతిసార విజృంభిస్తోంది.
ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యసిబ్బంది అతిసార వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేయాల్సి వున్నా ఆరోగ్య కార్యకర్తలు విధి నిర్వహణలో ప్రదర్శిస్తున్న అలక్ష్యం రోగుల ప్రాణాలు తీస్తోంది. ప్రతి రెండు గ్రామాలకు ఒక ఆరోగ్య కార్యకర్త ఉన్నా రోగాలు ప్రబలితేనే వారు గ్రామాలకు వస్తుండటంతో ఆరోగ్యంపై గ్రామీణుల్లో చైతన్యం కలగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పంచాయితీలకు కేటాయించే అరకొర నిధులకు అవినీతి గ్రహణం పట్టడంతో క్లోరినేషన్‌, పారిశుద్ద్యం వ్యవస్థ దారుణంగా ఉంటుందని విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామీణులకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూకుమ్మడిగా గ్రామ ప్రజలందరు వ్యాధుల బారిన పడితేనే తప్ప వైద్యసిబ్బంది అందుబాటులోకి రావడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పిహెచ్‌సిలకు వైద్యులు ఎగనామం పెట్టడంతో వ్యాధిగ్రస్తులకు ఆర్‌ఎంపిల వైద్యమే శరణ్యంగా మారింది. ఏదీ ఏమైనా దేశాభివృధ్దికి పట్టుకొమ్మలుగా నిలవాల్సిన పల్లెలు వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో వ్యాధులకు కేంద్రాలుగా మారడం శోచనీయం.

Leave a Reply

free website analytics