సీజన్ ముగుస్తున్నా అందని సబ్సిడీ వ్యవసాయ పరికరాలు
రైతే దేశానికి వెన్నెముఖ అని భావించిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతన్న సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించడం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రీకరణను ప్రవేశపెట్టింది.
అయితే అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఊదాసీనత, వ్యాపారుల లాభాపేక్షతో ఆళ్ళగడ్డ సబ్‌డివిజన్‌లో వ్యవసాయ యాంత్రీకరణకు తూట్లు పడుతున్నాయి. ఖరీప్ సీజన్ మొదలవ్వక ముందే పరికరాలను, యంత్రాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేస్తామని అందరూ సంబంధిత మండల వ్యవసాయాధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్భాటంగా సభలు, సమావేశాలు పెట్టి రైతులకు చెప్పారు. దీనిపై ఆశలు పెంచుకున్న సబ్ డివిజన్‌లోని దాదాపు 500 మందికిపైగా రైతులు సంబంధిత అధికారులకు దరఖాస్తులు అందజేశారు. మరి కొందరు సబ్సిడీ పోను మిగిలిన మొత్తానికి డిడిలు కూడా కట్టి అందజేసినట్లు తెలిసింది. సీజన్ మొదలవ్వకముందు మండలానికి రూ.7 లక్షల నిధులు మంజూరు అయ్యాయని వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో రైతులు దరఖాస్తులు ఇచ్చి యంత్రపరికరాలు తీసుకెళ్ళవద్దని ఎంతో ఆశపడ్డారు.
పరికరాలను వెంటనే అందజేస్తామన్న అధికారులు సీజన్ ముగుస్తున్నా పట్టించుకోకపోవడమే కాక ముఖం చాటేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతుల సంక్షేమం గురించి ఊకదంపుడు మాటలు మాని వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేయడమో… లేక వారు కట్టిన డీడీల సొమ్మును తిరిగి వారికి ఇవ్వడమో చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయ పరికరాల మీద ఉన్న ఆశతో అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి డీడీలు తీశామని, నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పరికరాలను అందడంలేదని రైతులు వాపోతున్నారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలు వస్తాయన్న ఆలోచనతో బయటమార్కెట్‌లో వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయలేదన్నారు. సొమ్ముపోయి దుమ్ముపట్టే అన్న చందంగా అటు ప్రభుత్వ వ్యవసాయ పరికరాలు రాకపోగా నెలలుగా తాము కట్టిన మొత్తానికి వడ్డీలు కూడా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.




