అంబటి రాం`బాంబు’, ‘రగడ’ పాటి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కల్లోలం

ambati-rambabuan-1260998614337
ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చిచ్చు రేపాయి. ఒక్కటి మినహా మిగిలిన 11 స్థానాలూ రాజీనామా చేసిన వారికే వస్తాయంటూ సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజ గోపాల్‌ చేసిన వ్యాఖ్యలు, ఆమేరకు ఆయన చేయించిన సర్వేలపై తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నేతలు భగ్గుమం టున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఓడితే.. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి కోసమే లగడపాటి వ్యూహ రచన చేస్తు న్నారని, అందులో భాగంగానే ఆయన సర్వేలను సాకుగా చూపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు.. వైఎస్‌ లేని లోటు ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపిం చిందని బహిష్కృత నేత అంబటి రాంబాబు మరో బాంబు పేల్చారు. వైఎస్‌ జీవించి ఉంటే ప్రచారానికి వెళ్లేవారంటూ పరోక్షంగా రోశయ్య అధైర్యాన్ని, అసహా యతనూ ఎత్తిపొడిచారు.
జగన్‌ ప్రచారా నికి వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉం డేదని, ఇప్పుడు పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదంటూ ఘాటుగా స్పందించడం కూడా కాం గ్రెస్‌లో కలకలం రేపుతోంది. వీరిద్దరూ ఉప ఎన్నికల ఫలితాలపై చేసిన వ్యాఖ్య లపై తెలంగాణ మంత్రులు, సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఫలితాలను వేదికగా చేసుకుని, జగన్‌ వర్గం కూడా ముందస్తుగా రోశయ్యను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిం చేందుకు సిద్ధపడుతుండటం ఆసక్తికరంగా మారింది.
లగడపాటి చేయించిన సర్వే ఫలితాలు ఉప ఎన్నికల్లో తాము పడ్డ కష్టాన్ని, వ్యూహాలను అవమానించి, నీరుగార్చేలా ఉన్నాయని తెలంగాణ మంత్రులు, సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్‌ పొన్నం ప్రభా కర్‌, ఏఐిసీసీ కార్యదర్శి పి.సుధాకర్‌రెడ్డి కూడా లగడపాటి వ్యాఖ్యలతో బాహాటం గానే విబేధించారు. లగడపాటి వ్యాఖ్య లతో పార్టీకి సంబంధం లేదని, తమ పార్టీ అత్యధిక స్ధానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి దానం నాగేందర్‌ మరో అడుగు ముందుకేసి నాలుగు స్థానాల్లో పార్టీ గెలుస్తుందని చెప్పారు.
ఒకవేళ లగడపాటి ఎప్పుడో సర్వే చేయిస్తే ఆ వివరాలను సంబంధిత నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా వ్యవహరి స్తున్న తమకు ముందుగా ఎందుకు తెలియచేయలేదని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. తమకు లగడ పాటి కొత్త వ్యక్తేమీ కానందున, సర్వే వివరాలను ముందుగా చెప్పిఉంటే స్థాని కంగా ఉన్న లోపాలను తాము సరిదిద్దు కునేవాళ్లమంటున్నారు. ఆ రకంగా సమా చారం ఇచ్చి ఉంటే బలహీనంగా ఉన్న ప్రాంతాలపై తాము మరింత దృష్టి సారించి, పార్టీ అభ్యర్థులను గెలిపించు కునేందుకు కృషి చేసేవాళ్లమని చెబు తున్నారు. అంటే రాజగోపాల్‌కు తెలం గాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని కాకుండా ఓడిపోవాలని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వే వివరాలు తమకు చెప్పకపోయినా, కనీసం ముఖ్య మంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కయినా చెప్పారా అని మంత్రులు, సీనియర్‌ నేతలుప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రితో పనులు చేయించుకుంటున్నారు కాబట్టి కనీసం ఆయనకయినా చెప్పి ఉంటారని భావిస్తున్నామని ఓ సీనియర్‌ నేత చెప్పారు. అదే నిజమయితే తమకు ముఖ్యమంత్రి నుంచి ఉప ఎన్నికలకు సబంబంధించి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని చెబుతున్నారు. అంటే ఈ విషయంలో అసలు లగడపాటి సీఎంకు వాస్తవాలు చెప్పారా? లేదా? ఒకవేళ చెబితే సీఎం తమకు ఆ విషయాన్ని కావాలనే చెప్పలేదా? అన్న అనుమానం ఇప్పుడు మంత్రుల్లో మొదలయింది. అయినా, సమైక్యవాది అయిన రాజగోపాల్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయని సీనియర్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. లగడపాటి కనీసం పార్టీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కయినా సర్వే వివరాలు చెప్పి ఉంటే ఆయనయినా జాగ్రత్త పడేవారంటున్నారు.
బహుశా గత ఎన్నికల్లో తాను చేయించిన సర్వేలు నిజమయినందు వల్ల ఈసారి కూడా ఉప ఎన్నికల్లో తన సర్వేలు నిజమని లగడపాటి భ్రమిస్తూ ఉండవచ్చని మంత్రులు చెబుతున్నారు. తాము నియోజకవర్గాల్లో ఎంత కష్టపడ్డామో, ఏయే సామాజిక వర్గాలను ఒప్పించామో, ఎన్ని వ్యూహరచనలు చేశామో విజయవాడలో కూర్చున్న లగడపాటికేం తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజల నాడి పట్టడం నిత్యం జనం మధ్య ఉంటూ వారి అవసరాలు తీరుస్తున్న స్థానికులమయిన తమకే సాధ్యం కావడం లేదని, ఇక సర్వేలు చేసే వారికి జనం నాడి ఎలా తెలుస్తుందని మంత్రులు, నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘ఉప ఎన్నికల్లో ఎంత కష్టమో లగడపాటికేం తెలుసు? ఆయన సర్వేలు చేయిస్తే చేయించవచ్చు. కానీ మేం ప్రచారంలో తిరిగిన వాళ్లం మేము. వారి స్పందన, తీవ్రత మాకు మాత్రమే తెలుసు. లగడపాటికి ఏం తెలుసు? లగడపాటి ఏ లక్ష్యంతో ఎలాంటి వ్యూహంతో ఆ ప్రకటన చేశారో అందరికీ తెలుస’ని మంత్రులు వ్యాఖ్యానించారు.
మరోవైపు అంబటి చేసిన వ్యాఖ్యలపైనా పార్టీలో అలజడి మొదలయింది. వైఎస్‌ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రతికూల పరిస్థితుల్లో సైతం వైఎస్‌ ప్రచారం చేసి, కాంగ్రెస్‌ స్థానాలు కాని నియోజకవర్గాలను సైతం గెలిపించారని చేసిన వ్యాఖ్యలు.. రోశయ్య అసమర్థత, అధైర్యాన్ని సూచిస్తున్నాయి. జగన్‌ను ప్రచారానికి తీసుకువస్తే కొన్ని స్థానాలయినా గెలిచేవాళ్లమని, రోశయ్యను వైఎస్‌తో పోల్చలేమన్నారు. ఆయన వైఎస్‌ అంత సమర్థుడు కాదని తెగేసి చెప్పడం పరిశీలిస్తే.. ఉప ఎన్నికల ఫలితాల్లో ఎదుర్కోబోయే వైఫల్యాన్ని జగన్‌ వర్గీయులు ఇప్పటినుంచే రోశయ్యకు ముడిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సైతం అంబటి వ్యాఖ్యలను సమర్థించి, వైఎస్‌ జీవించి ఉన్నట్టయితే తమ పార్టీ ఖాయంగా గెలుస్తుందని ధీమాతో చెప్పేవాళ్లమని, జగన్‌ను ప్రచారానికి పిలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇదిలాఉండగా, లగడపాటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి దానం నాగేందర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘లగడపాటి గతంలో కూడా సర్వేలు చేయించారు. అవి నిజమయ్యాయి. కాదనను. దానిని తప్పు పట్టడం లేదు కూడా. కానీ అప్పటికీ, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు. నేను ఆదిలాబాద్‌ జిల్లా ఇన్చార్జిగా ఉన్నా. కరీంనగర్‌, ఎల్లారెడ్డిలో కూడా తిరిగా. ఆదిలాబాద్‌ జిల్లాలో అయితే సరిహద్దు వరకూ ప్రచారం నిర్వహించా. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించా. ప్రజలు తెలంగాణ కన్నా అభివృద్ధి వైపే మొగ్గు చూపారు. నీళ్లు, రోడ్లు కావాలని అడుగుతున్నారు. ముందు తమ సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. పదిమందిలో తెలంగాణ గురించి ఇద్దరు మాట్లాడితే, సమస్యల గురించి 8మంది అడిగారు. తెలంగాణ కాంగ్రెస్‌ వల్లే వస్తుందన్న విశ్వాసం వారిలో స్పష్టంగా కనిపించింది. మేం కూడా కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసిందని, తెలంగాణకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. మీరే చూడండి. రేపు అద్భుత ఫలితాలు చూడబోతున్నార’ని నాగేందర్‌ జోస్యం చెప్పారు.

Leave a Reply