అధికారం ఉన్నా, లేకపోయినా దేశాభివృద్ధికే అంకితం – సోనియాగాంధీ ప్రతిన

04.09
అధికారంలో ఉన్నా లేకపోయినా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల, ముఖ్యంగా బడుగు వర్గాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వరుసగా నాల్గవ పర్యాయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా గాంధీ ప్రతినబూనారు. పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆమె శుక్రవారంనాడిక్కడ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌లతో పాటు పెద్దసంఖ్యలో సీనియర్‌ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ నుండి అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ను అందుకున్నారు.  ‘కార్యకర్తలు నన్ను మరోసారి పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకొన్నారు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా దేశానికి సేవ చేయడం అతిపెద్ద బాధ్యత అని నేనెప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఉంటాను, మనం అధికారంలో ఉన్నా, లేకపోయినా మనమెల్లప్పుడూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తూనే ఉండాలి’ అని శ్రీమతి సోనియా గాంధీ ఉద్బోధించారు. తనపై మరోసారి విశ్వాసముంచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని మరింత సమున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తానని సోనియా హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఎల్లప్పూడూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి  చేయాలని కోరారు. అంతకుముందు, అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ సోనియా గాంధీ నాల్గవ పర్యాయం అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ఆమెకు సర్టిఫికెట్‌ అందజేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎఐసిసి కోశాధికారి, సీనియర్‌ నాయకుడు మోతీలాల్‌ వోరాలు సోనియాకు పుష్పగుచ్ఛాలందించి అభినందనలు తెలిపారు.
కార్యకర్తల కోలాహలం: సోనియా ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా స్థానిక అక్బర్‌ రోడ్డులోని ఎఐసిసి కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సవ వాతావరణం నెలకొన్నది. పార్టీ అధ్యక్షురాలి నివాసం, దానికి ఆనుకొనే ఉన్న ఎఐసిసి కార్యాలయాల ఎదుట అక్బర్‌ రోడ్డు కార్యకర్తలతో నిండిపోయింది. శ్రీమతి సోనియా ఎన్నికైనట్లు ప్రకటించగానే కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. ఆనందంతో రోడ్డుపైనే నృత్యం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకొని అత్యంత కోలాహలంగా గడిపారు.

Leave a Reply

free website analytics