అధ్యక్ష ఎన్నికపై నేడు లాంఛన ప్రకటన – మేడమ్ ఎన్నిక ఏకగ్రీవం!

MANMOHAN3-9
లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. మేడమ్ సోనియా మరోసారి కాంగ్రెస్ పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగోసారి ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమైంది. ఆ పదవి కోసం ఆమె తరఫున మినహా ఇంకెవరి నుంచీ నామినేషన్లు దాఖలు కాకపోవడంతో.. శుక్రవారంనాడు ఆమె ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. గురువారం గడువులోగా దాఖలైన మొత్తం 55 సెట్ల నామినేషన్లూ సోనియా పేరును ప్రతిపాదిస్తూ వచ్చినవేనని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రకటించారు.  ప్రధాని మన్మోహన్‌తో మొదలెట్టి, పలువురు కేంద్ర మంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులతో కూడిన బృందాలు ఆమె పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశాయి. పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా నేతృత్వంలోని గ్రూపుతో కలిసి ఓ నామినేషన్ సెట్‌పై యువ నేత రాహుల్‌గాంధీ సైతం సంతకం చేసి, ఎన్నికల అథారిటీకి సమర్పించారు. పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులూ ఆమె పేరును ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు.
అంతకుముందు ప్రధాని మన్మోహన్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రాహుల్ గాంధీలు 10-జనపథ్‌కు వెళ్లి అభ్యర్థిత్వానికి సోనియా నుంచి లాంఛనప్రాయమైన అంగీకారం పొందారు. మొత్తంమీద 1998 ఏప్రిల్‌లో పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా.. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధినేతగా పనిచేసిన నేతగా ఇప్పటికే రికార్డు సృష్టించారు.  మొదట్లో రాజకీయాల్లోకి వచ్చేందుకే విముఖత ప్రదర్శించిన 63 ఏళ్ల సోనియా.. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక క్రమేపీ పార్టీని పటిష్ఠపరిచి, యూపీఏను రెండుసార్లు అధికారంలోకి తెచ్చారు. కాగా, అధ్యక్షురాలిగా సోనియా పేరును ప్రకటించాక పార్టీ వర్కింగ్ కమిటీని రద్దు చేస్తామని ఆస్కార్ వెల్లడించారు. డిసెంబర్‌లో పార్టీ తదుపరి ప్లీనరీ జరిగే వరకు ఓ స్టీరింగ్ కమిటీని నియమిస్తారని వివరించారు.
బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం
కాంగ్రెస్ పగ్గాలను మరోసారి సోనియా చేపట్టనుండటంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. “కాంగ్రెస్ నిబంధనావళి ప్రకారం ఏ వ్యక్తీ కూడా బ్లాక్, జిల్లా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రెండుసార్లకు మించి ఎన్నిక కాకూడదు. జాతీయ అధ్యక్ష పదవికి మాత్రం ఈ నిబంధన ఎందుకు వర్తింపజేయరు? సోనియా ప్రధానమంత్రి పదవిని ‘త్యాగం’ చేసిన ట్లే ఈ పదవినీ నెహ్రూ-గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తికి అప్పగించాలి” అని బీజేపీ ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దీనిపై “నాలుగుసార్లే ఎందుకు.. పార్టీ కోరుకుంటే 40సార్లు సోనియానే అధ్యక్షురాలిగా ఉంటారు” అంటూ ఏఐసీసీ ప్రధా న కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ ఎదురుదాడి చేశారు.

Leave a Reply

free website analytics