అభివృద్ధిలో ‘అనంత’ను అగ్రస్థానంలో నిలుపుదాం…

అక్షర క్రమంలోనే కాదు… అభివృద్ధిలో కూడా జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ అన్నారు. గురువారం అనంతపురంలోని పోలీసు పెరేడ్ మైదానంలో జరిగిన 63వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైన రైతు సంక్షేమం కోసం జిల్లాలో అనేక రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలకు గాను మొత్తం రూ.231 కోట్ల పంట రుణాలను జిల్లాలోని రైతన్నలకు అందజేశామన్నారు.
4 లక్షల 74 వేల మంది రైతులకు 70 కోట్ల రూపాయల సబ్సిడీతో 4.25 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ వేరుశనగ విత్తనాన్ని అందజేసినట్లు గుర్తు చేశారు. 2009-10 సంవత్సరానికి సంబంధించి సకాలంలో పంట రుణాలు వడ్డీ చెల్లించిన రైతులందరికీ పావలా వడ్డీ పథకం కింద రూ.18.36 కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. వ్యవసాయమనే జూదంలో ప్రతి ఏటా ఓడిపోతున్న అనంత అన్నదాతను ఆదుకోవడానికి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఏకె సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో వ్యవసాయం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయించడం జరిగిందన్నారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల 2010 అక్టోబర్‌లో వచ్చిన జల్‌తుఫాన్ కారణంగా తీవ్రంగా పంట నష్టపోయిన రైతులకు రూ.245 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఈ మొత్తాన్ని మొదటిసారిగా ఆన్‌లైన్ ద్వారా ఆయా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. జల్‌తుఫాన్ కారణంగా 2010-11 సంవత్సరంలో 4 లక్షల 3వేల 695 మంది రైతులు పొందిన పంట రుణాలపై రూ.54.17 కోట్ల వడ్డీని మాఫీ చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ఖరీఫ్ నుండే వేరుశనగ పంటకు వాతావరణ బీమాను అమలు చేసేందుకు అన్ని చర్యలను తీసుకుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 63 ఆటోమేటిక్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
పండ్లతోటలను పెంచాలనే ఉద్దేశంతో జిల్లాలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును అమలు చేయడంలో జిల్లా అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు. ఇప్పటి వరకు 38వేల 458 హెక్టార్లలో 75శాతం రాయితీతో 73.57 కోట్ల రూపాయల ఖర్చుతో మామిడి, చినీ, బొప్పాయి, అరటి, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 19వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతోందని, మల్బరీ సాగులో మన జిల్లా రాష్ట్రానికే ఆదర్శమన్నారు. 9 లక్షలు పాడిపశువులను, 42.46 లక్షల గొర్రెలను, మేకలను వ్యాధుల బారిన పడకుండా పశు సంవర్ధక శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పావలా దిగుబడిని పెంచి రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను ఏర్పాటు చేసే క్రమంలో జిల్లాలో రెండు పాల డెయిరీలు, 45 పాలశీతలీకరణ కేంద్రాలు, వెయ్యి పాల సేకరణ కేంద్రాల ద్వారా రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు వలస వెళ్లకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 7 లక్షల 15వేల మంది కూలీలకు జాబ్‌కార్డులను అందజేశామన్నారు. దళిత రైతుల సంక్షేమాన్ని కోరుతూ ఇందిర జలప్రభ కార్యక్రమాన్ని రాయదుర్గంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 165 బ్లాక్‌ల్లో భూముల అభివృద్ది కోసం 240 లక్షల రూపాయలను ఖర్చు చేశామన్నారు. జలయజ్ఞం కార్యక్రమంలో అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరాక్రాంతి పథం స్ర్తీశక్తి భవనాల నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే రాజీవ్ యువకిరణాల పథకంలో భాగంగా ఈ ఏడాదిలో అర్హత కలిగిన 5,910 మంది యువతకు గ్రామీణ అభివృద్ధి శాఖ, మెప్మా సంస్థల శిక్షణాలయాల్లో శిక్షణ కల్పించి 5,089 మంది యువతకు ప్రముఖ నగరాల్లోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. జిల్లాలో 11 లక్షల 8వేల 192 మంది కార్డుదారులకు 2,825 చౌకదుకాణాల ద్వారా 15వేల364 మెట్రిక్ టన్నుల రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ విద్యామిషన్ ద్వారా బడి ఈడి పిల్లలందరినీ బంగారు భవిత కార్యక్రమం కింద బడికి పంపిస్తున్నామన్నారు.
వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి, జెసి నాగిరెడ్డి తాగునీటి పథకాల పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. శ్రీరామిరెడ్డి పథకం ద్వారా ప్రస్తుతం హిందూపురం మునిసిపాలిటీకి మడకశిర నియోజకవర్గంలోని 395 గ్రామాలకు మంచినీరు సరఫరా అవుతోందన్నారు. 4వ దశలో కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని 336 గ్రామాలకు తాగునీరు ఇవ్వడానికి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జెసి నాగిరెడ్డి తాగునీటి పథకం కింద తాడిపత్రి, గుత్తి, శింగనమల, అనంతపురం, ధర్మవరం నియోజకవర్గాల్లోని 514 గ్రామాలకు మంచినీటి ఇబ్బందులు తొలుగుతాయన్నారు. రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించి రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలన్నదే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకల్లో ఎస్పీ షహనవాజ్‌ఖాసీం, జాయింట్ కలెక్టర్ అనితారామచంద్రన్, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎంఎల్‌సి డాక్టర్ గేయానంద్, ఎంఎల్‌ఏ గురునాథరెడ్డి, ఏజెసి చెన్నకేశవరావులతోపాటు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యాలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.




