అమలాపురం ఘటనపై నేడో, రేపో అరెస్టులు – డిజిపి దినేష్‌రెడ్డి


అమలాపురం ఘటనలకు సంబంధించి కీలక ఆధారాలు త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర డిజిపి దినేష్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. అమలా పురం, ధవలేశ్వరం ఘటనలకు సంబంధించి రానున్న 24గంటలలో వివరాలు బహిర్గతం అవుతాయన్నారు. ఈ ఘటనలపై సిఎం ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహానేతల విగ్రహాల విషయంలో సర్వేచేసి వాటి స్థితిగతులను తెలుసుకుంటామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డిఎస్‌పిని నియమించాలన్న ఆలోచన ఉందని, ఇందుకోసం త్వరలో సబ్‌ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియ హైదరాబాద్‌ కమిషనరేట్‌ నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు. యానాంలో జరుగుతున్న ఘర్షణల దృష్ట్యా రెంటు ప్లాటూన్ల బలగాలను పంపినట్టు తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డుల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని వారికి ఆరోగశ్రీ, బస్‌పాస్‌లు, వేతనాలు పెంపు విషయంలో త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని అన్నారు. వేతనాల పెంపుపై కమిటీ నివేదిక అందిందన్నారు. సోమవారం వేతనాల పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నక్సల్స్‌ కదలికలపై నిఘా కొనసాగిస్తున్నామని సరిహద్దులు దాటి వచ్చే నక్సల్స్‌ నిరోధించామన్నారు. రాష్ట్రంలో నక్సల్స్‌ను అణచివేయడంలో పోలీసులు విజయం సాధించారన్నా రు. రిక్రూట్‌మెంట్‌లో పైరవీలకు తావులేదన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. మద్దెలచెరువు సూరిహత్య కేసులో భాను కదలికలపై సమాచారం ఉందని త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఎస్‌.ఐ., సి.ఐ.ల పదోన్నతులపై రాష్ట్ర స్థాయిలోత్వరలో నిర్ణయం తీసుకుంటామని కొన్ని రేంజిల పరిధిలో పలువురు వెనుకబడ్డారని అన్నారు. విలేకరుల సమావేశంలో విజయవాడ కమిషనర్‌ మధుసూదనరెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌.పి. రవివర్మ, కృష్ణా జిల్లా ఎస్‌.పి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

free website analytics