అమెరికాలో విశాఖ విద్యార్థి మృతి

06.09
అమెరికాలోని మిస్సిసిపి నదిలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో విశాఖపట్నానికి గౌతమ్‌ జోసెఫ్‌ స్మిలెస్‌ (24) అనే విద్యార్థి మృతి చెందారు. ఈ విషయాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆదివారం తెలిపింది. లూసియానా స్టేట్‌ వర్శిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న గౌతమ్‌ శనివారం మిత్రులతో కలిసి జలవిహారానికి వెళ్లినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. ‘గౌతమ్‌ ఎనిమిది మంది మిత్రులతో కలిసి జలవిహారానికి వెళ్లాడు. వారు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ప్రాణరక్షణ జాకెట్‌ వేసుకోకపోవడంతో గౌతమ్‌ నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్లు అతడ్ని ఒడ్డుకు తెచ్చారు. అయితే గౌతమ్‌ అప్పడికే ప్రాణాలు వదిలాడు’ అని తానా తెలిపింది. మృతదేహాన్ని విశాఖ తరలించేందుకు సహకరించాల్సిందిగా గౌతమ్‌ తల్లిదండ్రులు తానాను కోరారు. కేంద్ర మానవ వనరుల శాఖ సహయ మంత్రి డి పురంధేశ్వరి ఈ ప్రమాదంపై తానా ప్రతినిధి తోటకూర ప్రసాద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయంలో అక్కడి విదేశాంగశాఖతో కానీ, ఇతర అధికారులతో కానీ సంప్రదింపులు జరిపేందుకు సహకరిస్తానని చెప్పారు.
గౌతమ్‌ మృతదేహాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల ఎనిమిదో తేదీకల్లా విశాఖ చేరుకోవచ్చని తానా తెలిపింది. 2009 జనవరిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం గౌతమ్‌ అమెరికా వెళ్లారు. లూసియానా స్టేట్‌ వర్సిటీలో మాస్టర్స్‌ ఇంజనీరింగ్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చివరి సెమిస్టర్‌లో ఉన్నారు. గౌతమ్‌ తండ్రి శామ్యూల్‌ స్మిలెస్‌ భారత్‌ హెవీ ప్లేట్స్‌ అండ్‌ వీస్సెల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌పివి)లో పనిచేస్తున్నారు. తల్లి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. గౌతమ్‌కు ఒక చెల్లెలు కూడా ఉన్నారు.

Leave a Reply

free website analytics