అసలైన నివాళి వైఎస్‌ ఆశయ సాధనే – గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రోశయ్య

03.09.01
సభలు, సమావేశాలు, విగ్రహాల ఆవిష్కరణ, చిత్రపటాలకు పూలదండలు వేయడమే దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించినట్లు కాదని, ఆయన ఆశయాలు, చేపట్టిన కార్యక్రమాలను నిజాయితీ చిత్తశుద్ధితో అమలు చేయడమే నిజమైన నివాళి  అవుతుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. పీసీసీ ఆధ్వర్యాన గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్‌ ప్రథమ వర్థంతి కార్యక్రమంలో ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ రోశయ్య పాల్గొని కొద్దిసేపు ప్రసంగించారు. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, రోశయ్య, ఏఐసిసి కార్యదర్శి కె.బి.కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావుతోపాటు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వట్టి వసంతకుమార్‌, మాణిక్య వరప్రసాద్‌, దానం నాగేందర్‌, పి.రాంచంద్రారెడ్డి, నగర మేయర్‌ కార్తీకారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ నాయకులు తొలుత వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైఎస్‌ వర్థంతి జరుగుతుందని నమ్మకంగా లేదని అన్నారు.
నాకంటే వయసులో దాదాపు పదిహేను సంవత్సరాల చిన్నవాడు. ఎంతో గొప్ప భవిష్యత్‌ కలిగినవాడు. కానీ గత ఏడాది ఇదేరోజు అకాల మరణంతో ఆ ఆశలన్నీ
అడియాశలు అయిపోయాయని రోశయ్య ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్‌కు శ్రద్ధాంజలి అంటే సభలు, సమావేశాలు, విగ్రహాలను ప్రతిష్టించడం, చిత్రపటాలు పెట్టి నివాళులర్పించడం కాదు ఆయన ఆశయాలు, చేపట్టిన కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైఎస్‌ జన్మతహ ఔధార్యం కలిగిన వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఔధార్యం పెంచుకున్నారని అంటే పొరపాటని రోశయ్య పేర్కొన్నారు. వైఎస్‌కు తనకు 1978లో మొదటిసారిగా శాసనసభ్యునిగా ఎన్నికైన నాటినుంచి తెలుసునని ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక, ఆ తర్వాత రెండవసారి ఎన్నుకోబడిన తర్వాత ఆయనలో ఆ భావన క్రమంగా పెరిగిందని ప్రజాసంక్షేమానికి, కార్యక్రమాలను ప్రకటించి అమలు చేయడంలో వైఎస్‌ గొప్ప ధైర్యవంతుడని ముఖ్యమంత్రి కొనియాడారు.
వైఎస్సార్‌కు నివాళి అంటే ఆయన చేపట్టిన కార్యక్రమాలను సవ్యంగా, నిజాయితీగా అమలు చేయడమేనని అన్నారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని, వైఎస్‌ కలలు కన్న మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా వెళ్ళలేకపోయానని, సరిగ్గా మాట్లాడలేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి తన బాధను వ్యక్తపరిచారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఊహించని రోజు ఇది. వైఎస్‌ మనలో లేరు, ఈ లోకంలోనే లేరు అనేది ఈ రోజుకి పూర్తిగా నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయి సంవత్సరం దాటిందంటే నిజంగా నమ్మలేకపోతున్నారని అన్నారు. వైఎస్‌ 1978 నుంచి ఎమ్మెల్యేగా పూర్తిస్థాయి రాజకీయాలలో ఉన్నారు. ఒక యువనాయకుడిగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, క్రమంగా ఎదిగి 20 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆయనలో గొప్ప మార్పు వచ్చిందని డిఎస్‌ పేర్కొన్నారు. అయితే 2003లో చేసిన పాదయాత్ర తర్వాత అంతకుముందు ఉన్న రాజశేఖరరెడ్డిలో చాలా వ్యత్యాసం ఉందని డిఎస్‌ కొనియాడారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌లో సమైక్య నాయకత్వం ఉండాలని అందుకోసం అందరి సహాయ సహకారాలు తీసుకోవడానికి నెలకు ఒకసారి అందరితో కలిసేవారమని ఆ తర్వాత అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు, చిన్నాపెద్దా లేకుండా సాగించామని డిఎస్‌ గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని ఆనాడు సమైక్య నాయకత్వంతో ఇచ్చిన పిలుపుకు ప్రజలు ఆదరించారని ఆ తర్వాత 2004 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రిగా వైఎస్‌ తూచాతప్పకుండా అమలు చేశారని అన్ని సంక్షేమ కార్యక్రమాల అమలును గరిష్ఠ స్థాయికి తీసుకువచ్చారని డిఎస్‌ గుర్తుచేశారు. వాటన్నింటినీ ఈరోజు ముఖ్యమంత్రి రోశయ్య అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్‌ యుక్తవయసులోనే రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని డిఎస్‌ తెలియజేశారు.
కానీ రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు మాసాలలోనే ఊహించని దుర్ఘటన జరిగిందని, అటువంటి క్లిష్ట పరిస్థితులలో రోశయ్య అధికార పగ్గాలను చేపట్టారని ఆయన చెప్పారు. వైఎస్‌కు తనకు మధ్య సంబంధం ప్రేమా ధ్వేషం వంటిదని అనేక అంశాలలో కలిసి నిర్ణయాలు తీసుకునప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మా ఇద్దరి మధ్య విభేదాలు ఉండేవని, కానీ చివరకు ప్రజాసంక్షేమం కోసం ఇద్దరం అంగీకరించేవాళ్ళమని డిఎస్‌ తెలియజేశారు. వైఎస్‌ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు సహాయం అందించాలని అధిష్ఠానం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని, కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తూ, ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారని, ఇక ఆ సహాయాన్ని ఎలా బాధితులకు చేర్చాలన్నదానిపై అధిష్ఠానం మార్గదర్శకాల సూత్రాలను రూపొందిస్తుందని పీసీసీ కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుందని అధ్యక్షుడు తెలియజేశారు. ఈరోజు కాంగ్రెస్‌ ముందుకుసాగుతూ మంచి కార్యక్రమాలు చేపడుతుందని, మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇటు మంత్రివర్గంలో, అటు అన్నిస్థాయిల్లో ఉన్న పార్టీ శ్రేణుల్లో ప్రభుత్వంలో సమన్వయం, ఐక్యత ఎంతో అవసరమని డిఎస్‌ అభిప్రాయపడ్డారు. మంత్రులు, పార్టీ సీనియర్లందరినీ ఒక దగ్గర చేర్చడానికి కృషి చేయగలనని హామీ ఇచ్చారు. వైఎస్‌ కార్యక్రమాలను మరింత పటిష్టవంతం చేసి అర్హులందరికీ చేరినప్పుడే నిజమైన నివాళి అని డిఎస్‌ పేర్కొన్నారు. ఏఐసిసి కార్యదర్శి కె.బి.కృష్ణమూర్తి కూడా ప్రసంగించారు.

Leave a Reply

free website analytics