ఆయనో అసమర్థ ముఖ్యమంత్రి – గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ధర్నా

21.07.01
నిన్నటిదాకా మహారాష్ట్ర ప్రభుత్వం.. తెలుగుదేశం పార్టీ మధ్య సాగిన బాబ్లీ యుద్ధం.. ఇప్పుడు రాష్ట్రానికి చేరింది! అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మధ్య కేంద్రీకృతమైంది! మాటల తూటాలు పేలాయి! వాగ్బాణాలు దూసుకొచ్చాయి! అధినేతలు మొదలు.. నేతల వరకూ పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారు! అటు ముఖ్యమంత్రి.. ఇటు మాజీ ముఖ్యమంత్రి! ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు!  రోశయ్య చేతగాని సీఎం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటే… ఆయన ఓ హైటెక్ నేత.. ఏ పని కావాలన్నా ఒక్క సారి క్లిక్ చేస్తే అయిపోతుంది.. అంటూ వెటకారం దట్టించి తిప్పికొట్టారు ముఖ్యమంత్రి రోశయ్య! అధినాయకుల దారిలోనే నేతలూ నడిచారు! నిన్నటిదాకా సంయమనం పాటించినట్లు కనిపించిన కాంగ్రెస్ ఒక్కసారిగా విరుచుకుపడింది.  పలువురు నేతలు బాబ్లీ వ్యవహారంలో టీడీపీని ఆరేశారు. బాబ్లీ.. టీడీపీ విష పుత్రిక అని ఆ పార్టీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపర్చాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేందుకే చంద్రబాబు బాబ్లీ యాత్ర పెట్టుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలంటూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించడం మంచిది కాదని కాంగ్రెస్ శాసనసభా పక్షం వ్యాఖ్యానించింది.  టీడీపీ హయాంలోనే బాబ్లీ మొదలైందన్న రోశయ్య వ్యాఖ్యలపై టీడీపీ నేత నాగం జనార్దనరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రోశయ్యను ముసలోడిగా అభివర్ణిస్తూ.. ‘బుద్ధుందా?’ అని నిలదీశారు. రోశయ్య అలా చెప్పడం నీతి మాలిన చర్యన్నారు. అన్నం తినేవాడెవడూ అలా చెప్పడని దుయ్యబట్టారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోశయ్య గోచి ఊడటం ఖాయమని హెచ్చరించారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రజాప్రతినిధులపై జరిగిన లాఠీచార్జిని బషీర్‌బాగ్ సంఘటనతో పోల్చడమేమిటని విరుచుకుపడ్డారు.  ఇదిలా ఉండగా… గోదావరిపై మహారాష్ట్ర అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ తదితర ప్రాజెక్టులపై వాస్తవాలను వెల్లడించేందుకు, క్షేత్రస్థాయిలో జన సమీకరణ చేసి వాటిపై పోరాడేందుకు ఈ నెల 25న హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించే నిమిత్తం ముందుగా ఇక్కడ ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ కూడా ఇదే సలహా ఇచ్చింది.  కాగా… మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పర్యవేక్షణ, నియంత్రణ కేంద్రం ఆధీనంలో ఉండాలని టీఆర్ఎస్ అభిప్రాయపడింది. బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్రంలోని అఖిలపక్ష బృందానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పీఆర్పీ అధినేత చిరంజీవి బుధవారం లేఖ రాశారు. అటు రాష్ట్రం వెలుపల కూడా బాబ్లీ రగులుతూనే ఉంది.
ఇంత జరిగినా బాబ్లీ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం తలబిరుసుతోనే ఉంది. ఏమైనా ఉంటే సుప్రీం కోర్టులో చెప్పుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ వ్యాఖ్యానించారు. అంతేకానీ.. ఇలా ఆందోళనల పేరుతో రోడ్డు పైకి వచ్చి శాంతిభద్రతల సమస్యను సృష్టించడం సరి కాదని అన్నారు. కాగా… చంద్రబాబు ఒక్కరే వస్తే బాబ్లీ ప్రాజెక్టును చూపిస్తామని నాందేడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత భాస్కరరావు పాటిల్ చెప్పారు.
ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు టీడీపీ నేతలకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయన్న ఆరోపణలు ఉంటే.. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే దృష్టిలో ఈ మాత్రపు అవమానాలు సరిపడినట్లు లేవు. చంద్రబాబుకు చవాన్ సర్కారు అల్లుడిలా మర్యాదలు చేసిందని మండిపడ్డారు. ఖైదీల డ్రస్సులేసి, చిప్పకూడు తినిపించి, మగ్గులో నీళ్లివాల్సిందని అన్నారు. అలా చేస్తే.. అప్పుడే వారంతా తిరిగి వెళ్లిపోయేవారని చెప్పారు.

Leave a Reply

free website analytics