ఆర్జిత దోషుల’పై చర్యలు – టీటీడీ ఈవోకు సీఎం ఆదేశాలు

_g3_news_me_
టీటీడీలో ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, అధికారులపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం కె.రోశయ్య టీటీడీఈవో ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించినట్టు సమాచారం.  టీటీడీలో ఆర్జిత సేవల టికెట్ల కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్న దానిపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఆదేశించిన విషయం విదితమే. అయితే దీనిపై విచారణ పూర్తి చేసి పది రోజుల క్రితం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీ దినేష్‌రెడ్డి సీఎంకు నివేదికను ఇచ్చారు.  విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగులు, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కుంభకోణంలో టీటీడీకి చెందిన ఉద్యోగులు, అధికారులతో పాటు బ్యాంకు ఉద్యోగులు, ఇంజనీర్లు కుమ్మక్కై కంప్యూటర్ల పాస్‌వర్డ్‌లను కూడా హాక్ చేశారని విజిలెన్స్ పేర్కొంది. ఆర్జిత సేవల టికెట్ల జారీకి సంబంధించి ఆడిట్ విభాగం తరచూ తనిఖీ చేయాలని సిఫారసు చేసింది. విజిలెన్స్ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి ఆమోదించారు.

Leave a Reply

free website analytics