ఆశాజనకంగా మెరుగుపడుతున్న ఆర్ధిక పరిస్థితి – సి.ఎ.రోశయ్య

img1091030023_1_1
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.రోశయ్య పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పటికే ప్రగతిదాయక మార్గంలో అత్యంత వేగంగా పయణిస్తుందని ఆయన తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవాలరంగాలలో ఇప్పటికే మెరుగైన ఫలితాలను రాబడుతున్నామని వివరించారు. ప్రపంచ వ్యాప్తం మాంద్యం పరిస్థితులు కొనసాగిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రగతి ఆశాజనకంగానే ముందుకు సాగుతుందని తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించే దిశగా 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి టి. చటర్జీ తదితరులతో ముఖ్యమంత్రి కె.రోశయ్య 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంత నివేదికపై సమీక్ష నిర్వహించారు. గత మూడేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రగతి ఆశాజనకంగా ఉందని ముఖ్యమంత్రి వివరించారు. సామాజిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలు మరింతగా మొరుగుపడాల్సివుందని ఆయన అభిప్రాయపడ్డారు. సుపరిపాలన లక్ష్యం నెరవేర్చే విధంగా పరిపాలనలోని లొసుగులను నియంత్రించాల్సివుందని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను సకాలంలో చేరవేయడం ప్రధానమనే లక్ష్యంగా అధికార యంత్రాంగం కార్యనిర్వహన బాధ్యతలను నిర్ధిష్టంగా పాటించాల్సివుందని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ది ఎజెండా అర్హులకు లక్ష్యాలను చేరవేయడం అనే అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సివుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వ్యవస్థాపరమైన లోపాలను సవరించుకోవల్సివుందని చెప్పారు. అర్హులైన వారికి ప్రయోజనం కల్పించడం, అర్హతలేని వారికి అర్హుల ప్రయోజనాలను వర్తింపచేయడం లాంటి పరణామాలు శాస్త్రీయ పద్దతిలో నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా వుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రణాళిక కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌ ముఖ్యమంత్రికి వివరించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్ళేందుకు జరుగుతున్న కృషిని పేర్కొన్నారు. పదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కొంత గడ్డుగా కనిపించినప్పటికీ 11వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఆశాజనకమైన మార్పుతో వృద్ధి దిశగా పయణిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వృద్ధిరేడు 7.8 శాతం కాగా, రాష్ట్రం 8.3 శాతం సాధించిందని తెలిపారు. సేవ, పారిశ్రామిక రంగాలలో మరింతగా వృద్ధి సాధించేందుకు ప్రణాళికబద్ధమైన చర్యలు వేగిరపరచాల్సివుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య అధికారులకు సూచించారు. ఆర్ధికంగా రాష్ట్ర పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నప్పటికీ వరదలు, కరువు పరిస్థితులు కారణంగా భారీ నష్టాలను కూడా చూడాల్సివస్తుందని ఆయన చెప్పారు. 2011 మార్చి నాటికి రాష్ట్ర వృద్ధి రేటు 7 శాతం నమోదు కాగలదనే ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 23 అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం వృద్ధి దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరకాలంలో 204 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయగలిగామని చెప్పారు. ఈ సంవత్సరం 208 లక్షల మెట్రిక్‌ టన్నులు ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా వ్యవసాయ రంగంలో వృద్ధిని సాధించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దారిద్య్ర నిర్మూలన, ఉపాధి అవకాశాలు పెంపు లాంటి కార్యక్రమాలతో పాటు అర్హులకు ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి దోహదపడుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. గత సంవత్సర కాలంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత పటిష్టపడిందన్నారు. ప్రపంచ ప్రమాణాల మేరకు మౌలిక వసతులతో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామని తెలియజేశారు. సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు.

Leave a Reply

free website analytics