ఆ టేప్స్ ప్రసారాలు ఆపండి – నిత్యానంద

నిత్యానంద స్వామికి లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన అశ్లీల దృశ్యాల ప్రసారాలను వెంటనే ఆపేయాలని కర్నాటక హైకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని, కొన్ని మీడియా సంస్థలను ఆదేశించింది. నిత్యానంద, తమిళ నటి రంజిత మధ్య బెడ్ రూమ్ దృశ్యాలను పూర్తి అశ్లీలంగా, సెన్సార్ చేయకుండా ప్రసారం చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని ఆదేశించాలని కోరుతూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది కెఎన్ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం పై జస్టిస్ వి.గోపాలగౌడ, జస్టిస్ బీఎస్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కేసు తదుపరి విచారణ 17కు వాయిదా పడింది. నిత్యానంద స్వామి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని టీవీ చానళ్లు అశ్లీల దృశ్యాలను ప్రచారం చేశాయని, ఇలాంటి దృశ్యాలు పిల్లలు, పెద్దలు అందరిపై దుష్ప్రభావాన్ని చూపుతాయని, అలాగని నిత్యానందను కాపాడాలన్న ఉద్దేశం తనకు లేదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపే అటువంటి వాటి ప్రసారాలను ఆపాలన్నదే తన తాపత్రయమని సుబ్బారెడ్డి కోర్టు ముందు తన వాదనలు వినిపించారు.




