ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌కు హాజరవనున్న మొయిలీ, కేవీపీ
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధమ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఇడుపులపాయలో కాంగ్రెస్ వర్గాలు, వైఎస్ అభిమానులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వైఎస్ స్మృత్యర్థం అక్కడ నిర్మించిన వైఎస్ ఘాట్‌ను ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా అక్కడ ప్రార్థనలు జరుపుతారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వీరప్పమొయిలీతో పాటు ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు, రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, అహ్మదుల్లా, రఘువీరారెడ్డి పాల్గొననున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి బుధవారం రాత్రే ఇడుపులపాయకు పయనమయ్యారు. వైఎస్ కుటుంబ సన్నిహితుడు, గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ శైలజానాథ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు గురువారం ఇడుపుల పాయ చేరుకుంటారు.
కడపతో సహా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ అభిమానులు ఇడుపులపాయకు చేరుకునే అవకాశం ఉండడంతో వీరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇడుపుల పాయలో ఒకటిన్నర లక్షల మందికి భోజన వసతి కల్పించనున్నారు. కడప నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇడుపులపాయకు భారీసంఖ్యలో ఉచిత బస్సులను నడపనున్నారు. గత ఏడాది ఇక్కడ జరిగిన వైఎస్ అంత్యక్రియల సందర్భంగా భారీ ఎత్తున జనం హాజరై విపరీతంగా ట్రాఫిక్ స్తంభించిపోయినందున ఈ సారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.




