ఉగ్రవాదం కన్నా సైబర్ దాడులే ప్రమాదం
గత సంవత్సరం సైబర్ దాడుల కారణంగా భారత కంపెనీలకు 58 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, దేశంలోని 42 శాతం కంపెనీలు ఏదో ఒక సమయంలో ఈ తరహా దాడుల బారిన పడ్డవేనని సిమాంటిక్ కార్పొరేషన్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీ స్టడీ – 2010′ వివరించింది. ఈ అధ్యయనం వివరాలను సిమాంటిక్ ఇండియా ఎండి విశాల్ ధూపర్ మంగళవారం నాడు మీడియా ముందుంచారు. నగదు నష్టం కన్నా రహస్యంగా దాచి వుంచాల్సిన వివరాలు బయటకు వెళ్ళడం వల్ల కలిగే అనర్ధాలే అధికమని, ఉగ్రవాదం, సునామీ, భూకంపాలకన్నా సైబర్ దాడులు ప్రమాదకరమైపోయాయని ఆయన వివరించారు. 2009లో కంపెనీల్లో అంతర్గతంగా కూడా దాడులు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. 34 శాతం కంపెనీలపై అధిక సంఖ్యలో మాలిసియస్ అటాక్స్ జరిగాయని ఈ దాడుల వల్ల ఎంతో కొంత నష్టం వాటిల్లుతూనే ఉందని అధ్యయనంలో భాగంగా కంపెనీలు వివరించాయి. సమీప భవిష్యత్‌లో ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీ మరింత కష్టతరం కానుందని అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్గనైజేషన్స్ స్వయంగా రక్షణ చర్యలు చేపట్టుకోవాలని, దాడులు జరిగినప్పుడు వేగంగా స్పందించే టీమ్‌ను కలిగివుండాలని సూచించింది. ముఖ్యంగా ఐటి అడ్మినిస్ట్రేటర్లు డేటా దాచుకునే విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించింది.




