ఉప ఎన్నికల కాదు బాబ్లీపై పోరాటమే ముఖ్యం – ఎర్రబెల్లి

yerrabelli
బాబ్లీ సహ పన్నెండు ప్రాజెక్టులను నిలిపి వేయిస్తామని కేసీఆర్ సోనియాగాంధీతో ప్రకటన చేయిస్తే ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉప ఎన్నికలు తమకు ప్రధానం కాదని బాబ్లీ ప్రాజెక్టు నిలుపుదలపై పోరాటం చేయడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.  బాబ్లీపై తాము రాజకీయం చేయడం లేదని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే చేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గు లేదని వాళ్లు ఎందుకు బతుకుతున్నారని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ గురించి ఆంధ్రా ప్రభుత్వం ఒక్కనాడు కూడా తమను నివేదిక అడగలేదని మహారాష్ట్ర సీఎం చవాన్ ప్రకటించిన విషయమై సీఎం రోశయ్యను అందరు తిడుతున్నారని అన్నారు.  కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నగర టీడీపీ నేతలను ఆయన తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలతో కలిసి గురువారం పరామర్శించారు. అనంతరం అక్కడే విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. బాబ్లీ ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తున్నదని నోరు పారేసుకోవద్దని ఆయన హితవు పలికారు. పీఎంతో ఉన్న భేటీ కారణంగానే బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. ఐదేళ్లుగా బాబ్లీ సహ 12 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల గురించి పోరాటం చేస్తున్నామన్నారు. ఒక్కనాడు కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పోరాటం చేసింది లేదన్నారు. ఉప ఎన్నికల కోసం రాజకీయం చేయడం లేదని అవి అసలు తమకు ప్రధానం కాదని ఏనాడు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందుతామని చెప్పలేదని అన్నారు.  రైతుల శ్రేయస్సు కోసం బాబ్లీ ప్రాజెక్టును నిలిపి వేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. భారత ప్రధాని ప్రాజెక్టులను నిలిపివేస్తామని చెబితే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటామన్నారు. తమను విమర్శిస్తున్న కేసీఆర్ ఏనాడైనా ప్రాజెక్టు గురించి మాట్లాడారా, ఆయన గానీ, వారి ఎమ్మెల్యేలు గానీ తన్నులు తిన్నారా అని ప్రశ్నించారు.  సోనియాగాంధీకి, కేసీఆర్‌కు మధ్య ఏమున్నదో తెలియదు గానీ ఆమెతో ములాఖత్ అయి ఆమెను తిట్టడం లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సోనియాగాంధీతో ప్రాజెక్టులను నిలిపి వేస్తామని హామీ ఇస్తే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటామని దయాకర్‌రావు అన్నారు.
పెనుగంగపై ప్రాజెక్టులకు శ్రీకారం..
ఆదిలాబాద్ మీదుగా ప్రవహించే పెనుగంగ ప్రాజెక్టుపై మరో నాలుగు ప్రాజెక్టులను నిర్మించేందుకు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని, మరో నాలుగింటికి అంచనాలు తయారు చేసిందని దయాకర్ రావు చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారుతుందన్నారు. ప్రాణహిత, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు నీళ్లు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు.  బాబ్లీ సహ 12 ప్రాజెక్టులను నిలిపి వేసే వరకు తమ పోరాటం ఆగదని దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు పటోళ్ల మహేందర్‌రెడ్డి, విజయరమణారావు, గంగుల కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

free website analytics