ఎపిపిఎస్సీసీ రొచ్చుగుంట – కెసిఆర్

”ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రొచ్చుగుంటలా మారింది. కమిషన్ చైర్మన్ వెంకట్రాంరెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తామంటే అభ్యర్థులు ఎలా ఊరుకుంటరని” తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఎపిపిఎస్సీ నియామకాల్లో తెలంగాణకు 42 శాతం వాటా మాటల మందం ఇస్తమంటున్నారనీ, ఇచ్చేకాడ మాత్రం దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జిల్లాకు 10 నుంచి 20 లక్షల ఎకరాల వరకు సాగునీరు, అదనంగా లక్షా 50 వేల ఉద్యోగాలు వస్తాయనీ, మన భవిష్యత్ తరాల కోసమైనా తెలంగాణను సాధించుకోవాలనీ, ఇందుకోసం సాగుతున్న మహోధ్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం తెదేపా, పలు పార్టీకు చెందిన నేతలు తెరాసలో చేరిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. ఎపిపిఎస్సీసీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వమే ఎంక్వైరీ పెట్టింది. అంటి వ్యక్తి గ్రూప్-1 పరీక్షలు నిర్వహిస్తారా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎపిపిఎస్సీ నియామకాల్లో తెలంగాణ వాటా తేల్చ వరకు పరీక్షలు నిర్వహించవద్దనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలించకపోగా, కనీసం అనుమానాలను నివృత్తి చేద్దామనే ఆలోచన చేయడం లేదెందుకుని ప్రశ్నించారు. డిసెంబర్ 31 తరువాత తెలంగాణ ఏర్పాటు కాకపోతే, ఉప ఎన్నికలలో తీర్పు చెప్పిన విధంగానే అంతే సమైక్యంగా కదలివచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉందనీ, ఒకవేళ అనుకోనిది ఏదైనా జరిగి నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే డిసెంబర్ 31 తరువాత గాంధీ మహాత్ముని మాదిరిగా సహాయ నిరాకరణోద్యమం చేపట్టి రాష్ట్రంలో పరిపాలనను స్థంభింపజేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 5న ఖమ్మంలో లక్ష మందితో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కెసిఆర్ తెలిపారు. తెలంగాణ 40 శాతం ఉద్యోగాల వాటా తేల్చకుండా గ్రూప్-1 పరీక్షలను యధాతథంగా నిర్వహిస్తామని ప్రకటించడం తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురి చేయడమే అవుతుందని తెలంగాణ బిసి సంఘాల జెఎసి పేర్కొంది.




