ఏడుగురు సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసిన హమీద్‌ అన్సారీ

aptn-1268073037401
మహిళా బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రాజ్యసభలో సోమవారంనాడు అల్లర్లకు దిగిన ఏడుగు సభ్యులను చైర్మన్ హమీద్ అన్సారీ సస్పెండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వారు పాల్గొనరాదని ఆయన ఆదేశించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ రాజ్యసభలో సోమవారంనాడు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం సమాజ్ వాది, ఆర్జేడి, ఎల్జేపి పార్టీలకు చెందిన సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్ళి ఆయన టేబిల్ పై ఉన్న మైకులను విరిచేందుకు, సభపతి చేతిలో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలను గుంజుకునేందుకు యత్నించారు. బిల్లు పత్రాలను చింపి సభలో విసిరివేశారు. దీనితో ఎస్పీ, ఆర్జేడీ పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులపై రాజ్యసభ చైర్మన్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారంనాడు ప్రకటించారు. ఎజాజ్ అలీ, సుభాష్ యాదవ్, సబీర్ అలీ, నంద్ కిషోర్ యాదవ్, కమల్ అఖ్తర్, అమీర్ ఆలంఖాన్, వీర్పాల్ సింగ్ యాదవ్ లను చైర్మన్ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్లు చదివి వినిపించారు.  కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకూ తొలిసారి వాయిదా పడిన సభ తిరిగి సమావేశం అయినప్పటికీ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎస్పీ, ఆర్జేడీ, బిఎస్పీ సభ్యులు తమ ఆందోళను కొనసాగించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని సజావుగా నిర్వహించుకునేందుకు సహకరించాలంటూ చైర్మన్ అన్సారీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఆ పార్టీల సభ్యుల రభసను కొనసాగిస్తూనే ఉన్నారు. దీనితో మధ్యాహ్నం రెండు గంటల వరకూ రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు.  మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో కూడా ఎస్పీ, ఆర్జేడీ, బిఎస్పీ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించడంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు. మహిళా బిల్లుపై జరిగిన ఆందోళనకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వం వహించారు. అంతకు ముందు శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ మంగళవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో భేటీ అయి మహిళా బిల్లుపై తాము వ్యతిరేకిస్తున్న అంశాల గురించి వివరించారు. సోమవారంనాడు అంతర్జాతీయ శత వార్షిక మహిళా దినోత్సవం రోజున మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉభయసభల్లోనూ ఓటింగ్ జరగకుండా ఎస్పీ, ఆర్జేడి ఎంపీలు అడ్డుకున్నారు.

Leave a Reply

free website analytics