ఏ ముఖం పెట్టుకుని విద్యార్థి రాజకీయాలు – బాబు మీద మండిపడ్డ – బొత్స

1-3slider1
ఓవర్‌ యాక్షన్లు, డ్రామాలు కట్టిపెట్టండని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్‌చంద్రబోష్‌, బాలరాజులు మండిపడ్డారు. చంద్రబాబు స్వార్ధ రాజకీయాలు చేయడానికి విద్యార్ధులే దొరికారా? అని వారు దుయ్యబట్టారు. రాజకీయాలు చేయాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయని, చంద్రబాబు ప్రలోభంలో పడవద్దని విద్యార్ధులకు వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలలో ఇప్పటికే చులకనైపోయిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని విద్యార్ధి రాజకీయాలు చేస్తున్నాడని? వారు ప్రశ్నించారు. సోమవారం సచివాలయంలోని డి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రులు బొత్స, పిల్లి సుభాష్‌చంద్రబోష్‌, బాలరాజులు పాల్గొని ”సచివాలయంలో తెదేపా ఎమ్మెల్యేల అరెస్ట్‌ అంశం”పై తీవ్రంగా స్పందిస్తూ మాట్లాడారు.. ముందుగా మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోష్‌ మాట్లాడుతూ, విద్యార్ధులు ఫీజు రియాంబర్స్‌మెంట్‌ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించుదామని వచ్చిన తెదేపా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో తెదేపా నేతలు గోపాలకృష్ణరెడ్డి, రత్నంలు తనకు ఫోన్‌ చేసి వినతిపత్రం తీసుకోవల్సిందిగా కోరారని, అయితే సిఎం కార్యాలయం వద్ద తాను తీసుకోనని తన ఛాంబర్‌కు వస్తే తీసుకుంటాని బదులిచ్చానని చెప్పారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న తెదేపా ఎమ్మెల్యేలు పద్దతులు పాటించకుండా సిఎం కార్యాలయం ముందు ధర్నాకు పాల్పడటంతో పోలీసు అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు నిర్వహిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్న తెదేపా నేతలు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ పరపతి పెరుగుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా లేనిపోని అంశాలను లేవనెత్తుతుందని ఆయన ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హాయంలో ప్రవేశపెట్టిన ఫీజుల రీయాంబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది వరదలు, ఉద్యమాల వంటి కొన్ని అనివార్య కారణాల వలన ఫీజు రియాంబర్స్‌మెంట్‌ చెల్లింపులో కొంతమేర ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. ఫీజు రియాంబర్స్‌మెంట్‌ పథకం పట్ల ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తెదేపా నేతలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, తీర్పు ప్రభుత్వానికి, విద్యార్ధులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి పిల్లి పేర్కొన్నారు. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏ ఒక్క విద్యార్ధి భవిష్యత్‌కు ఇబ్బంది లేకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, విద్యార్ధులు సౌకర్యార్ధం ఒక టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఫీజు రియాంబర్స్‌మెంట్‌ అంశంపై వినతిపత్రం సమర్పించేందుకు సచివాలయానికి వచ్చిన తెదేపా నేతలకు మూడు రోజులు కిందటే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని, అయితే వారు రాలేదని, ఇప్పుడొచ్చి సిఎంను కలవాలంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం వారికి తెలియదా? అని నిలదీశారు. సచివాలయంలో తెదేపా నేతలు సవ్యంగా నడుచుకోకపోవడం వలనే పోలీసులు అరెస్టు చేశారని మంత్రి బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. ఇప్పటికే సిగ్గుపడాల్సిన చంద్రబాబు నాయుడు తగదురమ్మ అంటూ వీరవిహారం చేస్తారా? అని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని 34 లక్షల మంది విద్యార్ధులకు రూ.1500 కోట్లు బకాయిలు చెల్లించామని, మిగిలిన రూ.250 కోట్ల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి, మైనారిటీలకు పెద్ద ఎత్తును ఉపకార వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాలలో దేశంలోనే మన రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Leave a Reply

free website analytics