ఏ విచారణకైనా సిద్ధం -అంబటి

08.09.01
ఏఐసిసి అక్రమాలపై విచారణ చేయాలని ఏసిబి కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాను ఆహ్వానిస్తున్నానని ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ అంబటి రాంబాబు అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఏ విచారణకైన సిద్ధమని చెప్పారు. విచారణకు సహకరిస్తానని కూడా ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరగాలని ఇద్దరు మాజీ మంత్రులు డిమాండ్‌ చేసినప్పుడు తాను దానిని ఆహ్వానించానని పేర్కొన్నారు. సిబిఐ విచారణకు డిమాండ్‌ చేసిన రోజు అందుకు అనుగుణంగా ఆదేశించివుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేదని చెప్పారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.  రంగాస్వామి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఏసిబి కోర్టు ఈ రకమైన ఆదేశాన్ని ఇచ్చిందని మీడియాలో చూశానన్నారు. ఇంతకు ముందే ప్రభుత్వమే స్వయంగా సిబిఐ విచారణకు ఆదేశించివుంటే బాగుండేదన్నారు. సిబిఐ విచారణకు తాను లేఖ రాసి ఉండాల్సింది అని ప్రస్తుత ఏపిఐఐసి ఛైర్మన్‌ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యనాలు వింతగా ఉన్నాయని చెప్పారు. మీపై ఆరోపణల వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు అని ప్రశ్నించగా అది తేలాల్సి ఉందన్నారు. సుబ్రమణ్యం వెనక రోశయ్య ఉన్నారో రోశయ్య వెనక సుబ్రమణ్యం ఉన్నారో తెలియదని అంబటి రాంబాబు ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మాట్లాడే వారు నాడు తాను పదవిలో ఉన్నప్పుడే ఎందుకు గళం విప్పలేదని అంబటి ప్రశ్నించారు.  తాను ఏపిఐఐసి ఛైర్మన్‌ పదవిలోనుంచి వైదొలిగి మూడున్నర సంవత్సరాలవుతోందని చెప్పారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణించాక, ఓదార్పు యాత్ర జరుగుతుండగా, వాటిని తాము సమర్థిస్తున్న తరుణంలోనే ఈ ఆరోపణలు గుర్తుకు రావడంపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో సభ్యుడినేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశంలో ఎవరినైనా ఎదురిస్తా అని జగన్‌ చేసిన వ్యాఖ్యనాల అర్థం సోనియాను వ్యతిరేకించడమేనని ఎందుకు అర్థంచేసుకోవాలని ఆయన అన్నారు.  దేశంలో ఇతర ప్రతిపక్షాలు లేవా బిజెపి పార్టీ లేదా అని ఆయన ప్రశ్నించారు. సోనియాను వ్యతిరేకిస్తానని జగన్‌ చెప్పినట్లు మీరు అర్థంచేసుకొంటే ఏమీ చేయలేమన్నారు. జగన్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ అని కొనియాడారు. ఏదో ఒక రోజు ఆయన సిఎం అవుతారని చెప్పారు. ఓదార్పునకు వచ్చిన ప్రజలను చూస్తేను జగన్‌ ప్రజాదరణ అర్థమవుతోందన్నారు. ఈ ప్రజాదరణ ఎంతటిదో భవిష్యత్‌లో తేలిసిపోతుందని వ్యాఖ్యనించారు. ఈ ప్రజాదరణను చూసే చంద్రబాబుకు వణుకుపుట్టిందన్నారు.

Leave a Reply

free website analytics