ఐదేళ్లలో ‘మన్నవరం’ పూర్తి – వైఎస్‌ సేవలకు ప్రశంసలు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

02.09
చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్‌టిపిసి-భెల్‌ ఉమ్మడి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. బుధవారం ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా ఆరు వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మన్నవరం ప్రాజెక్టు వైఎస్‌ సేవలకు సాక్ష్యమని ప్రస్తుతించారు. వెనకబడిన చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం రాజశేఖరరెడ్డి కృషి చేసి ఈ ప్రాజెక్టును మంజూరు చేయించారని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే విద్యుత్తు పరికరాల దిగుమతులను నిలిపివేయవచ్చని వివరించారు. స్వదేశీ పరికరాల వలన విద్యుదుత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు. ప్రభుత్వ రంగంలోని నవరత్న సంస్థలు ఎన్‌టిపిసి, భెల్‌ కలిసి మరో ప్రభుత్వ రంగ సంస్థకు ప్రాణం పోయటం అభినందనీయమన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా పడింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ‘వైఎస్‌ పురం’గా నామకరణం చేశారు.
కేంద్రం మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును తాము మహారాష్ట్రకు తీసుకుపోయేందుకు విఫలయత్నం చేశామని, అయితే వైఎస్‌ రికార్డు స్థాయిలో 750 ఎకరాల భూమిని కేటాయించి పరిశ్రమను రాష్ట్రానికి మంజూరు చేయిచుకున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మాట్లాడుతూ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన తాను వైఎస్‌ఆర్‌తో కలిసి ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించానన్నారు. అనారోగ్యం కారణంగా సభకు రాని ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, కేంద్ర మంత్రులు వీరప్పమొయిలీ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మన్నవరం సర్పంచి వనమ్మ పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
దేశ ప్రగతికి వైమానిక సేవలు కీలకం
ప్రైవేటు భాగస్వామ్యంతో విమానాశ్రయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. విద్యుత్తు ఉపకరణాల ప్రాజెక్టుకు మన్నవరం వద్ద శంకుస్థాపన చేసిన అనంతరం రేణిగుంట విమానాశ్రయం వద్ద నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో విమాన ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామన్నారు. తిరుపతి విమానాశ్రయం వల్ల శ్రీలంక, మలేషియా, సింగపూరు నుంచి భక్తులు నేరుగా తిరుపతికి వచ్చే వీలుంటుందని తెలిపారు. కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి ప్రఫుల్‌పటేల్‌ మాట్లాడుతూ ప్రపంచ విమానయాన రంగంలో దేశం తొమ్మిదో స్థానంలో ఉందని, వచ్చే ఐదేళ్లలో ఐదో స్థానానికి చేరుకునేలా కృషి చేస్తామన్నారు. కృష్ణా బేసిన్‌లో ఆయిల్‌ నిక్షేపాలు సంవృద్ధిగా ఉన్న నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయాన్నీ ఆధునీకరించాలని నిర్ణయించామన్నారు. వరంగల్‌, విజయవాడ, కడప విమానాశ్రయాలనూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రధాని పర్యటన సాగిందిలా!
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పర్యటన షెడ్యూల్‌ ప్రకారమే సాగింది. మొత్తం ఆరున్నర గంటల పాటు తిరుపతి, మన్నవరం, తిరుమలలో హుషారుగా పర్యటించారు. రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వెళ్లాల్సి ఉండగా 5.45కు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి మన్నవరానికి వెళ్లి భెల్‌- ఎన్‌టిపిసి సంయుక్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హెలికాఫ్టర్‌లో తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీ స్టేడియానికి చేరుకొని అక్కడ నుంచి కారులో తిరుమలకు వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీవారిని దర్శించుకొని ఆలయంలో అర్ధగంటసేపు ఉన్నారు. ఆయనకు మేల్‌చాట్‌ వస్త్రం కప్పి దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, స్పెసిఫైడ్‌ అథారిటీ ఛైర్మన్‌ సత్యనారాయణ, ఇఓ ఐవైఆర్‌ క్రిష్ణారావు ఘనంగా సత్కరించారు. సాయంత్రం 3.30 గంటలకు తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. స్టేడియం నుంచి హెలికాఫ్టర్‌లో రేణిగుంటకు చేరుకుని అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం 5.40 గంటలకు వాయుదూత్‌ విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

Leave a Reply

free website analytics