ఐ సే గెటౌట్ – దరఖాస్తు దారునిపై చిందులు తొక్కిన కలెక్టర్ దాన కిషోర్
జిల్లా కలెక్టర్ ఎం.దానిశోర్‌కు కోపమొచ్చింది. ఆ కోపాన్నంత చూపిస్తూ శివాలెత్తారు. సమస్య విన్నవిద్దామని కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తుదారుడిపై చిందులుతొక్కారు. ఐ సే గెటౌట్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ సెక్యూరిటీచేత గెంటించారు. కలెక్టర్ వైఖరితో సదరు దరఖాస్తుదారుడు బిత్తరపోవాల్సి వచ్చింది. కలెక్టర్ ఛాంబర్ సమీపంలోనే కంటతడిపెట్టుకున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలావున్నాయి…. అల్వాల్‌కు చెందిన గోపికృష్ణారావు కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించేందుకు సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌కు వచ్చారు. తనకు అందజేసిన ఎన్‌ఓసీపై రెండు సంతకాలు లేవని… అధికారులు పట్టించుకోవడంలేదని కలెక్టర్‌కు విన్నవించేందుకు ఆయన ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం 5.10నిమిషాల ప్రాంతంలో ఫిర్యాదుదారులనే కలిసేందుకు కలెక్టర్ తన ఛాంబర్ ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే నా ఫైలు మీవద్ద ఉందని సదరు ఫిర్యాదుదారుడు అంటుండగానే కలెక్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. నీ ఫైలు నా దగ్గర ఉందని ఎవరు చెప్పారంటూ చిందులు తొక్కారు. ఆఫీసు ఫైళ్ల గురించి ఎవరు చెప్తారంటూ శివాలెత్తిన ఆయన ఐ సే గెటౌట్ అంటూనే ఇక్కడినుంచి ఇతన్ని పంపించండంటూ సెక్యురిటీని పురమాయించారు. కలెక్టర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా బిత్తరపోయిన దరఖాస్తుదారుడు న్నీళ్ల పర్యంతమాయ్యరు. ఎన్‌ఓసీ కోసం నెలలతరబడి తిరుగుతుంటే గత నెలలో క్లియరెన్స్ ఇచ్చారని, అయితే, కలెక్టర్ సంతకాల్లో రెండుచోట్ల లేకపోవడంతో మళ్లీ అధికారులకు ఇచ్చానని, దీనికోసం అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడంలేదని, ఫైలు కలెక్టర్ వద్ద ఉందని తెలిస్తే సమస్యను కలెక్టర్‌కు విన్నవించాలని రోజూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నానని దరఖాస్తుదారుడు కన్నీళ్ల పర్యంతమయ్యారు.




