ఒక్కొక్క బ్యాలెట్ రోశయ్య సర్కార్‌కు నోటీస్ – కేసీఆర్

ఉప ఎన్నికలు జరుగనున్న 12 నియోజక వ ర్గాల్లో ప్రజలు వేసే ఒక్కొక్క బ్యాలెట్ రోశయ్య సర్కార్‌కు నోటీస్ కావాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం మేడిపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవటానికి 150 సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు లైన్ కట్టి రాజీనామాలు చేసిండ్రని, అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని పార్టీల ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి ఉంటే దెబ్బకు ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ ఎప్పుడో వచ్చేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలలో పదవుల కొరకు ఆశ పడే నాయకులు రాజీనామాలు చేయలేదని అన్నారు. రాజకీయ జేఏసీ ఏర్పడిన తర్వాత భే షజాలు విడిచి అన్ని పార్టీల నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి రాజీనామా చేయమని అడిగితే కాంగ్రెస్, టీడీపీల ఎమ్మెల్యేలు వెనుకడుగు వేశారన్నారు. ఉప ఎన్నికల్లో మీరు వేసే ప్రతి ఓటు శ్రీ కష్ణ కమిటీకి రిపోర్ట్ కావాలని అన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం వేములవాడలో 80 శాతం ఓటర్లు రమేష్ బాబుకు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. రాజీనామాలు చేయక నాయకులు దద్దమ్మలు అయిన ప్రజలు చైతన్యవంతులై రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. తెలంగాణ భూములను తెగ నమ్మిన ఆంధ్ర నాయకులు గల్ఫ్ బాధిత కుటుంబాల కోసం 500 కోట్లు అడిగితే ఇవ్వలేదని దుబాయ్ పోయి సచ్చిపోతే పీనుగులు తెచ్చే దిక్కు లేదని ఆంధ్ర కాంట్రాక్టర్‌లు ఇచ్చిన డబ్బు మద్యంతో ఎన్నికల్లో పంచడానికి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాకులాడుతున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు పోగొడితేనే ఢిల్లీకి సెగ తగిలి తెలంగాణ ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రమేష్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు, అభ్యర్థి రమేష్ బాబు, నాయకులు తుల ఉమ, జగన్ రెడ్డి, నారాయణ రెడ్డి, క్యాతం దశరథ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తిరుమల్ రావు, ఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




