ఒత్తిడిలకు లొంగేది లేదు – గ్రూప్‌ -1 యథాతథం – ప్రభుత్వ నిర్ణయం

Sachivalyam
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షలను యథాతథంగా కొనసాగించటానికే ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఉదయం నుంచి అత్యంత ఉత్కంఠభరిత పరిణామాల నడుమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వాటా తేలకుండా పరీక్షలు నిర్వహించడానికి అంగీకరించేది లేదని, ఖాతరు చేయకుండా పరీక్షలు జరపడానికి ముందుకు వెళితే.. తెలంగాణ అగ్నిగుండం అవుతుందని, టిఆర్‌ఎస్‌, జెఏసీలు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు చివరకు మంత్రుల బృందం ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పరీక్షల నిర్వహణ అనివార్యమైంది. అయితే పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ మంత్రులు డి.శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ, సునీతాలక్ష్మారెడ్డిలు సిఎంకు వివరించినప్పటికి ఫలితం లేకుండా పోయింది.
ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇరు ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేయడానికి సుముఖత వ్యక్త పరచలేదు. అయితే సిఎంను కలిసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని లేక పోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని వివరించామన్నారు. మిగిలిన మంత్రులు సైతం అదే మాట చెప్పినప్పటికీ ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయటంతో కొనసాగించాలనే ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సైతం తనను కలిసేందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలతో పరీక్ష నిర్వహణ విషయంలో వాతావరణాన్ని వేడి చేయవద్దని హితవు పలికారు.
హాజరీ బాగానే ఉంటుంది…
198 పోస్టుల కోసం జరిగే ఈ పరీక్షకు 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది పరీక్షలకు హాజరవుతారని భావిస్తున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు చెప్పారు. గైర్హాజరీ అనేది ఎప్పుడూ ఉంటుందని, ఈసారి అదేమీ కొత్త కాదని వారు వివరించారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరుగుతుండగా, సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు చెబుతున్నారు. సజావుగా సాగటం కోసం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అరవిందరావు ప్రకటించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంత చెప్పినా, ఏవైనా కేంద్రాల వద్ద శాంతి భద్రతలు తలెత్తే పరిస్థితి ఏర్పడితే అక్కడ మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని సైతం నిర్ణయించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. అన్ని బస్సులను పోలీసు భద్రత మధ్య నడుపుతున్నట్టు స్పష్టం చేసింది.
విఫలమైన రాయబారాలు
పరిస్థితులను అర్థం చేసుకుని పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రాంత మంత్రులు శనివారం ఉదయం నుంచీ చెబుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు అయితే పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రితో చెప్పామని, ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినదైనప్పటికీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాము చెప్పామన్నారు. విద్యార్థుల కోరికను ముఖ్యమంత్రికి వివరించామని చెప్పారు. ఒక దశలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏకంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌కే ఫోన్‌ చేసి పరీక్షను వాయిదా వేయాలని కోరినట్టు సైతం వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు.
పెరిగిన ఒత్తిడి…
మరోవైపు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పరీక్షను కచ్చితంగా వాయిదా వేయాల్సిందే అని ఉదయం నుంచీ ఒత్తిడి పెంచినా ఫలితం లేకపోయింది. ఢిల్లీలో ఎంపీలు మధు యాష్కీ, జి.వివేక్‌, వి.హనుమంతరావు తదితరులు ఉదయం నుంచీ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్‌ను పదేపదే చేశారు. అయితే ప్రభుత్వం ఈ ఒత్తిడికి లొంగిన దాఖలాలు కనిపించలేదు. ఇక విపక్షాలలో టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు, బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు, విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితులు సైతం తమ వంతు ప్రయత్నాలన్నీ చేశాయి. చివరకు గవర్నర్‌ను, మానవ హక్కుల సంఘాన్నీ కూడా కలసి వాయిదా వేయాలని విన్నవించారు.

Leave a Reply

free website analytics