ఓయులో మరో విద్యార్థి ఆత్మహత్య – పరిస్థితి ఉద్రిక్తత

29pan13e
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో క్యాంపస్ లోను, గాంధీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓయు వైస్ చాన్స్ లర్ తిరుపతిరావును విద్యార్థులు ఘెరావ్ చేసి అడ్డుకున్నారు. తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విద్యార్థి సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు సమాచారం.  నల్గొండ జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన సాయికుమార్ ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం తాను ఉంటున్న టెక్నాలజీ హాస్టల్ 108 నెంబరు గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని వేళ్ళాడుతున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు సాయికుమార్ ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ సాయికుమార్ మధ్యాహ్నం మృతిచెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఓయు ఇంజనీరింగ్ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి పెద్ద ఎత్తున గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి సాయికుమార్ మృతదేహాన్ని ఉస్మానియాకు తీసుకువెళ్ళేందుకు యత్నించారు. అయితే, గాంధీ ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున మొహరించి ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీనితో విద్యార్థులు గాంధీ వద్దే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం సిఆర్పీఎఫ్ దళాలను ఆస్పత్రి వద్ద మొహరించింది.  ఒక పక్కన సాయికుమార్ ఆత్మహత్య, విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ లో పరిస్థితి మళ్ళీ ఉద్రిక్తంగా మారింది. దీనితో మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయు రిజిస్ట్రార్ ప్రకటించారు. ఇలా ఉండగా, తెలంగాణ రాజకీయ నాయకులను నమ్మలేమంటూ సాయికుమార్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ లో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన మృతదేహానికి ఓయు నుంచి అసెంబ్లీ వరకూ అంతిమయాత్ర చేయాలని ఆ నోట్ లో సాయికుమార్ కోరినట్లు విద్యార్థులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న క్యాంపస్ లో సాయికుమార్ ఆత్మహత్యతో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

free website analytics