కమిటీకి చట్టబద్ధత ఉంది – జస్టిస్ శ్రీకృష్ణ

14.08
‘మేం చెప్పిందే ప్రభుత్వం వింటుంది. కమిటీకి చట్టబద్ధత ఉంది. నిర్ణీత గడువులోపే అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తాం’ అని జస్టిస్ శ్రీ కృష్ణ స్పష్టం చేశారు. శ్రీ కృష్ణకమిటీ చైర్మన్, కార్యదర్శి వీకే దుగ్గల్, మరో ఇద్దరు సభ్యులు వరంగల్ జిల్లా ముచ్చర్ల గ్రామస్తుల అభిప్రాయలను మంగళవారం సేకరించారు.  అందరికీ ఆమోదయోగ్యమైన నివేదికనే అందిస్తాం అని శ్రీకృష్ణ (తెలుగులో) ప్రకటించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎట్టిపరిస్థితులలో ఊరుకోమని, ఇప్పటికే తెలంగాణ ప్రాంత విద్యార్థులు, యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్నారని వారు తెలిపారు. మాకు కావలసింది రాష్ట్ర ఏర్పాటే తప్ప కమిటీలు కాదు. సాంకేతికంగా కమిటీని మేం బహిష్కరిస్తున్నాం. కానీ మా వాదనను బలంగా వినిపించేందుకు మీ ముందుకు వచ్చాం అని స్థానికుడు పృథ్వీరాజ్ కుండబద్దలు కొట్టారు.
మాకెప్పుడు విముక్తి: విద్యార్థిని స్రవంతి
“సర్.. మా తల్లిదండ్రులు మమ్మల్ని అప్పుచేసి చదివించారు. కానీ మేం ఏం చదువుకొని ఏం లాభం? మా ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోతున్నయి? ఆంధ్రా ప్రాంత ప్రజలు అందలం ఎక్కుతుంటే ఇక్కడ మేం అగాధంలోకి పోతున్నం. మాకెప్పుడు సార్ విముక్తి. మా తెలంగాణకు ఎప్పుడు విముక్తి. ప్లీజ్ సర్. మా తెలంగాణ మాకు ఇప్పించండి అంటూ” జస్టిస్ శ్రీకృష్ణతో ముచ్చర్ల గ్రామ విద్యార్థి గుడికందుల స్రవంతి తనగోడును వెళ్లబోసుకున్నారు.
మహాభారత యుద్ధమే …
కరీంనగర్: జిల్లాలోని నుస్తులాపూర్‌లో కమిటి ఆభిప్రాయ సేకరణ చేస్తున్న సమయంలో కొంతసేపు గందరగోళానికి దారి తీసింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండకపోతే మహాభారత యుద్ధం ఏర్పడుతుందన్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తూ తాను ఆ కామెంట్‌ను ఆ సమావేశంలో గొడవ గురించి మాట్లాడిందే తప్ప తెలంగాణ గురించి కాదన్నా రు.అంతకుముందు స మావేశంలో కమిటీకి తెలుగు అర్థం కాదేమోన న్న భావనతో జడ్పీటీసీ సత్యనారాయణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై వికె దుగ్గల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కమిటీ దృష్టికి వచ్చే అంశాలన్నీ ప్రభుత్వపరంగా రికార్డు అవుతాయని, తమకూ తెలుగు తెలుసునని, ఏ అంశాన్ని విస్మరించమన్నారు. జిల్లాలో మంగళవారం కమిటీ బెజ్జంకి మండలం తోటపల్లి, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామాల్లో పర్యటించింది. అనంతరం జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. జిల్లాపరిషత్ ఎదుట బీజేపీ నేతలు శ్రీకృష్ణ కమిటీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలుపగా జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్ అని జిల్లా ప్రజలు కమిటీకి తేల్చిచెప్పారు.  తిమ్మాపూర్ మండలం తోటపల్లి వద్ద జరిగిన సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ తెలంగాణకు జరుగుతున్న వివక్షపై ఏకరువు పెట్టారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు చేపడితే జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేదని, దానికి బదులు దేవాదులను ప్రతిపాదించినా అదీ కార్యరూపం దాల్చలేదని వివరించారు. తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తే జస్టిస్ శ్రీకృష్ణ ఫొటోలను తమ ఇళ్ళల్లో పెట్టుకొని పూజ చేస్తామని గ్రామస్తులు అన్నారు.

Leave a Reply

free website analytics