కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లింది – రాహుల్‌

rah
కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందనీ, బెంగాల్‌లో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉంటున్న వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వల్లించే కమ్యూనిస్టులు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతూ బెంగాల్‌కి చేసింది ఏమీ లేదని ఆయన సోమవారం ఇక్కడ ఒక సమావేశంలో విమర్శించారు. సోవియట్‌ యూనియన్‌ ఏ విధంగా అయితే, కుప్ప కూలిందో, బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కూడా కుప్పకూలడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కేటాయిస్తున్న నిధులను వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆయన ఆరోపించారు.’కేంద్రం పంపే నిధులు లబ్ధి దారులకు చేరడం లేదు. ఆ నిధులను వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం మాయం చేస్తోంది’ అని ఆయన అన్నారు.బెంగాల్‌ పారిశ్రామికంగా వెనుకబడిందన్న వాస్తవాన్ని సిపీఎం నాయకులే ఇటీవల గుర్తించారనీ, అందుకే, దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలకూ, బహుళజాతి సంస్థల అధిపతులకు ఎర్ర తివాచీ స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. మూడున్నర దశాబ్దాలుగా మార్క్సిస్టు ఫ్రంట్‌ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి చేసిందేమీ లేదన్న విషయం దీనిని బట్టే స్పష్టమవుతోందని ఆయన అన్నారు.  రాష్ట్రంలో పేద ప్రజలకు రేషన్‌ కార్డులు లేవనీ, బెంగాల్‌ని ప్రభుత్వం కాక, సీపీఎం కార్యకర్తలే నడుపుతున్నారనీ, పేద ప్రజల కోసం కాక, తమ పార్టీ వారి కోసం ప్రభుత్వాన్ని వారు నడుపుకుంటున్నారని ఆయన విమర్శించినప్పుడు సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు తెలిపారు. యువకులు కాంగ్రెస్‌లో చేరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. చైనాలోని కమ్యూనిస్టు నాయకులు కూడా సిపీఎంని ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు. ‘ఆ మధ్య నేను చైనా వెళ్ళినప్పుడు అక్కడి నాయకులు ‘మీ దేశంలో సీపీఎం వారు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని ఇంకా వేలాడుతున్నారేమని అడిగారు’ అని ఆయన అన్నారు.  బెంగాల్‌లో కాంగ్రెస్‌కి తిరిగి పూర్వ వైభవం రావడం ఖాయమనీ, కార్యకర్తలూ, నాయకులూ సమన్వయంతో పని చేస్తే ఇది ఎంతమాత్రం అసాధ్యం కాదని ఆయన అన్నారు. ‘ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుల్లో యువజన కాంగ్రెస్‌ని పునరుద్ధరించడం అసాధ్యమని చాలా మంది అన్నారు. కానీ, నేను వెళ్ళి అక్కడ పార్టీ శాఖలను ఏర్పరచడమే కాకుండా, కార్యకర్తలూ, నాయకుల మధ్య సమన్వయం ఉండేట్టు చేశాను. అలాగే, బెంగాల్‌లో కూడా కాంగ్రెస్‌కి పూర్వ వైభవం ఖాయం’ అని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్డీ నాయకులూ, కార్యకర్తలూ కలిసికట్టుగా ఏకోన్ముఖంగా కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

Leave a Reply

free website analytics