క్రీడల్లో శక్తిమంతుడు సచిన్‌

shilpaభారత క్రీడలను ప్రభావితం చేసిన వారిలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. దేశ క్రీడారంగంపై చెరగని ముద్రవేసిన వారిలో సచిన్‌ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న సచిన్‌ భారత క్రీడల్లోనే అత్యంత శక్తిమంతుడిగా ఎంపికయ్యాడు. రికార్డుల మీద రికార్డులతో హోరెత్తిస్తున్న సచిన్‌ ఇటీవలే వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే టెస్ట్‌లు, వన్డేల్లో అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.  మరోవైపు ఐపీఎల్‌ను సృష్టించిన పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చిన లీగ్‌ ఛైర్మన్‌ లలిత్‌మోడీ క్రీడలను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో రెండో స్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాన్ని లిక్కర్‌ కింగ్‌, బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ అధినేత విజయ్‌మాల్య దక్కించుకున్నారు. ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ నాలుగో స్థానంలో నిలిచారు. భారత సారథి ధోనీ ఐదో, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన షూటర్‌ అభినవ్‌బింద్రా 41వ, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా 50వ స్థానంలో నిలిచారు. క్రీడల్లో అత్యంత ప్రభావంతులుగా నిలిచిన వారిని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.

Leave a Reply