ఖమ్మం ఉక్కు తెలంగాణ ప్రజలకే చెందాలి – కెసిఆర్

ఖమ్మం జిల్లాలో ఉన్న సంపద అంతా తెలంగాణ ప్రజలకే చెందాలని, ఖమ్మం ఉక్కు – తెలంగాణ హక్కు అని టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావునినదించారు. సోమవారం ఖమ్మంలో జరిగిన ఖమ్మం కదనభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత సంపదను ఇప్పటి వరకు దోచుకెళ్ళారని, ఇప్పుడు ఎవరు ఆ ప్రయత్నం చేసినా తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నెలకొని ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వమే తవ్వితీసి ఇక్కడి ప్రజలకు ఉపాధి కల్పించి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటిని కూడా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అక్రమంగా వాడుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్రం రాగానే చుక్కనీరు కూడా ఆంధ్రకు పోనివ్వమని తెగేసి చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు కినె్నరసాని నుంచి తాగునీరు ఇవ్వాలనే ఒప్పందం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు నీరు ఇవ్వకుండా గత ఏడాది ధవళేశ్వరానికి తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1పరీక్షను రద్దు చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు, మంత్రులు, సంఘాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పోలీస్ పహారాల మధ్య పరీక్ష నిర్వహించారని ఆయన విమర్శించారు. పరీక్షలకు అతి తక్కువ శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. పరీక్ష రద్దు చేయించలేని కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక కులాల పేరుతో ఉన్న హాస్టళ్ళను మూసివేస్తామని, ప్రతి మండలానికి అవసరానికి సరిపోను రెసిడెన్షియల్ పాఠశాలలను పెట్టి కేజీ నుంచి పిజి వరకు విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, బట్టలు అందిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి దళితుడేనని, ఉప ముఖ్యమంత్రి ముస్లిం కులానికి చెందిన వారని స్పష్టం చేశారు. మొన్నటి ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ప్రజలు, నాయకులు గమనించారని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే సత్తా చూపుతామని ఆయన హెచ్చరించారు. అంతకు ముందు ఖమ్మం పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభాస్థలి వరకు ప్రదర్శన నిర్వహించారు. సభలో టిడిపి, పిఆర్పీ, కాంగ్రెస్, సిపిఎంలకు చెందిన కార్యకర్తలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.




