గగన విహాంగంలో అపశృతి – 152 మంది మృతి

an-1280335318488
పాకిస్తాన్‌లో బుధవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 152 మంది మృతి చెందారు. పాకిస్తాన్‌లోని ప్రయివేట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీలో బుధవారం ఉదయం 7.45 గంటలకు బయల్దేరింది. ఇస్లామాబాద్‌కు రెండు గంటల ప్రయాణం. ఇస్లామాబాద్‌ శివారు పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 100కు పైగా మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. భారీ వర్షం, పొగమంచుతో మార్గం కన్పించక దామనేఖో ప్రాంతంలో వున్న మార్గల్లా పర్వతాన్ని విమానం ఢకొీన్నదని పోలీసులు, సహాయ కార్యకర్తలు చెప్పారు. సగం కాలిన మృతదేహాలు పర్వత సానువుల్లో చెల్లాచెదురుగా పడివున్నాయని, భారీ వర్షం, మంచు కారణంగా విమాన శిధిలాలు, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. ప్రమాదానికి ముందు నగరంలో అతి తక్కువ ఎత్తులో ఎగిరిన విమానాన్ని తాము చూసినట్లు స్థానికులు మీడియాకు వివరించారు. గాయాలతో బయటపడిన వారి కోసం తాము వెతకగా ఎవరూ కనిపించలేదని వారు పేర్కొన్నారు. మృతులకు సంతాప సూచకంగా పాకిస్తాన్‌ ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అత్యవసర కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాక్‌ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ పాకీస్తానీయులేనని అధికారులు తెలియచేశారు. ప్రమాదానికి కారణం ఇంత వరకూ తెలియలేదు. కొంతమంది ప్రతికూల వాతావరణమే కారణమంటున్నారు. ప్రమాదాన్ని చూసిన కొంతమంది స్థానికులు విమానం బ్యాలన్స్‌ తప్పి కిందకి పడిపోయినట్లు కనపడిందని తెలిపారు. విమానం దిగవల్సిన సమయానికి కంట్రోల్‌ టవర్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.

Leave a Reply

free website analytics