గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌పై గందరగోళం

A.P.P.S.C,BULD
గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ పరీక్షలను వాయిదా వేయాల్సిందేనని తెలంగాణ ప్రాంత అభ్యర్థులు, తెలంగాణ రాజకీయ పార్టీల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రూప్‌-1లో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలని, అందుకు సంబం ధించిన జీవోలు తీసుకురావాలని పట్టుపడుతున్నారు. వాటా తేలిన తర్వాతే పరీక్షల నిర్వహించాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారు.
గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో కూడా రిజర్వేషన్లు పాటించాలనే అంశం కూడా వారి డిమాండ్లలో తాజాగా చేర్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల వేలాది మంది అభ్యర్థులు గ్రూప్‌-1 పరీక్షలకు సిద్ధం కాలేదని, కాబట్టి వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి కొన్ని వినతిపత్రాలు అందాయి. ప్రత్యేక తెలంగాణ తేలకుండా గ్రూప్‌-1 పరీక్షలు నిర్వ హించడం మంచిది కాదని, తేలిన తర్వాత నిర్వహిస్తే ప్రాంతాలవారీగా పోస్టులు కేటాయించ వచ్చని ఆ ప్రాంతం అభ్యర్థులు భావిస్తున్నారు. వీరి వాదన ఇలా ఉంటే… మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం… ఈ నెల 5నే గ్రూప్‌- 1 నిర్వహించాలని పట్టుదలతో ఉంది.
గవర్నర్‌ జోక్యంతో…
గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కాస్త మెత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ తెరవెనక గవర్నర్‌ కీలక పాత్రపోషిస్తున్నారు. ఆయన ఆదేశాల ప్రకారం అభ్యర్థులకు పోలీస్‌ రక్షణ ఏర్పాటుచేసి ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారమే ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. తమ తప్పు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సర్వీస్‌ కమిషన్‌ అధికారులు పేర్కొంటున్నారు.
పరీక్షల వాయిదాకు తెలంగాణ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తుంటే, నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుండడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది.పరీక్షలు నిర్వహించాలని సీమాంధ్ర అభ్యర్థులు ఇప్పటికీ డిమాండ్‌ చేస్తున్నారు. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 11 మంది ఎంపీలు సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన ఎంిపీలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా సిఎంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షల నిర్వహణ రాజకీయం రంగు పులుముకొంది.
నిర్వహణ బాధ్యత కలెక్టర్లకు..
గ్రూప్‌ -1 పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాల గురించి సమీక్షించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లాల ఎస్సీలకు ఆదేశాలు జారీ అవుతున్నాయి. కాగా, తెలంగాణ ప్రాంత ఎంపీలు, రాజకీయ నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు శుక్రవారం నుంచి రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 5న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
మంత్రిగారే నిర్ణయించాలి
గ్రూప్‌-1ను వాయిదా వేయాలా, నిర్వహించాలా అన్న విషయమై ఇక ఉన్నత విద్యాశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నిర్ణయం తీసుకోవాలి. గ్రూప్‌-1 పరీక్షలు జరగడం ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నది. ఆయన శుక్రవారం నిర్ణయం తీసుకోవచ్చు.
గురు పూజోత్సవం నాడు వద్దు – ఎపిటిఎఫ్‌
ఏపీపీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు మరో ఆటంకం కలగవచ్చు. ఆ రోజు గురుపూజోత్సవం కనుక ఆయా పాఠశాలల్లో టీచర్లంతా ఆ కార్యక్రమాలలో ఉంటారు. ఉపాధ్యాయులకు గ్రూప్‌-1 పరీక్షల డ్యూటీ పడింది. ఆ రోజు పరీక్షల నిర్వహణకు చాలామంది సుముఖంగా లేరు పరీక్షలను వాయిదా వేయాలని ఏపీటీఎ‌ఫ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కె.వేణుగోపాల్‌, షేక్‌జిలానీ డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

free website analytics