చేతగాకుంటే రాజీనామాలు చేయండి
విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం చేతకాకపోతే రాజీనామాలు చేయండి.. ఉపయోగం లేని ఉత్తుత్తి మీటింగులు ఎందుకు నిర్వహిస్తారని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్పుల దరఖాస్తుల పరిశీలనపై జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో శుక్రవారం పెన్నార్ భవనంలో ఉదయం 10 గంటలకు సమాశం ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. విద్యా సంవత్సరం ముగిస్తున్నా నేటికీ స్కాలర్ షిప్పులు మంజూరు చేయలేదని నాయకులు వాపోయారు. స్కాలర్‌షిప్పుల మంజూరులో ప్రభుత్వ కళాశాలల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తూ.. బడ్జెట్‌లో ముందుగా ప్రైవేటు కళాశాలలకే మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాగైతే ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద వర్గాల విద్యార్థుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఖచ్చితమైన హామీ ఇచ్చేంతవరకు సమావేశాన్ని జరగనీయమంటూ అధికారులు కూర్చున్న వేదిక వద్ద బైఠాయించారు.
ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వీరఓబులు, బీసీ సంక్షేమశాఖ అధికారి రమాభార్గవి కలుగజేసుకుని స్కాలర్‌షిప్పుల మంజూరులో ఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదని, బడ్జెట్ రాగానే ముందుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో ఆందోళన విరమించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు మూడు గంటల ఆలస్యంగా ప్రిన్సిపాళ్ల సమావేశం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రమణయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపాల్, నగర కమిటీ అధ్యక్షుడు లాల్‌బాషా, నాయకులు మధుశేఖర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే నరేష్, నాయకులు రామకృష్ణ, ఓబుళపతి పాల్గొన్నారు.




