చేతులు జోడించి అడుగుతున్నా – మంత్రి రఘువీరా

నిత్యం కరవుకోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న అనంత జిల్లాకు నేనున్నానంటు వెన్ను తట్టి ముందుకు నడిపించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని, అటువంటి మహోన్నత వ్యక్తిపై లేనిపోని మాట లు మాట్లాడి ఆయన ఆత్మను బాధ పెట్టవద్దని అందరికీ చేతులుజోడించి వేడుకొంటున్నాను. అటువంటి వ్యక్తిని ఒక్క మాటా మాట్లాడవద్దంటూ గురువారం స్థానిక లలిత కళాపరిషత్‌లో ఏర్పాటు చేసిన వై.యస్‌.ఆర్‌. ప్రథమ వర్థంతి సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కలెక్టర్‌ జనార్థన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ శైలజనాథ్‌, ఎంపి. అనంతవెంకట రామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత, గ్రంథాలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ. పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభలో వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిత్యం ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ‘‘ సహకార సేద్యంలో రైతులు అభివృద్ధి చెందాలని అధికార సమావేశం నిర్వహించిన మరుసటిరోజునే ఆయన మనల్ని వీడి వెళ్లారు. ఆయన ఉండి వుంటే రైతులు సహకార సేద్యం చేస్తు అభివృద్ధి చెందేవారన్నారు. అలాగే 10 టీయంసిల నీరు సాగు నీరు అందేలా చేశాడని అన్నారు. అందగానే వైయస్‌ గుర్తుకు వస్తారన్నారు. కనీసం ఈ జిల్లావాసి ముఖ్య మంత్రి అయినా కూడా అంత అభివృద్ధి చేయలేదన్నారు.
వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశయాలు, పథకాల రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రభుత్వ విప్‌ శైలజానాథ్‌ మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో బతకాలని వైయస్‌. రాజశేఖర్‌రెడ్డి మహాయజ్ఞం చేశాడన్నారు. ఏ ఒక్కరోజు అయినా వైయస్‌ గురించి మాట్లాడని వారు ఈ జిల్లాలో ఎవరూ లేరన్నారు. ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు పై చదువులు చదవలేక నిరక్షరాస్యులుగా వున్న సమయంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టడంతో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు చదివారన్నారు. ఈ ఘనత వైయస్‌దేనని ఆయన తెలిపారు. ఎంపి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు కులాలకు అతీతంగా పరిపాలించిన ఏకైక పరిపాలకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని రైతుల సంక్షేమం కోసం తాను అనుకొన్న ఇందిరమ్మ రా ్యం కోసం రూ.1500 కోట్లు రుణాలుగా రైతులకు ఇచ్చి వారికి అండగా నిలిచాడన్నారు.
ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో అరుదైన వ్యక్తిత్వం గల్గిన వ్యక్తి త్యాగశీలి వైయస్‌. ఆర్‌ అని, తనలో ప్రాణం వున్నంత వరకు వైయస్‌.ఆర్‌ ఆశయాలు కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత మాట్లాడుతూ ఎంతో మంది రాజకీయ వేత్తలు నాయకులు వున్నా ఒక నాయకుడు ప్రజలతోను, పార్టీ నాయకులతోను. కార్యకర్తలతోను ఎలా మెలగాలి, ఎలా మసలు కోవాలనేది క్షుణ్ణంగా తెలియపరిచే మహోన్నత వ్యక్తి వైయస్‌ఆర్‌ అని అన్నారు. ప్రతివర్గం వారికి చేయూత నిచ్చి ప్రజలు గుండెల్లో వుండి పోయారన్నారు. ఆయన ఆశయాలు కొనసాగిచాలన్నారు.

Leave a Reply

free website analytics