డిజిపికి గ్రూప్-1 ‘పరీక్ష’
డీజీపీ పదవి చేపట్టిన మూడు రోజుల్లోనే అరవింద రావుకు ఒక పెద్ద సవాల్‌ను ఎదుర్కో బోతున్నారు. అది ఐపిఎస్‌కు గ్రూప్ -1 పరీక్ష. గతంలో ఎన్నో విభాగాల్లో తిరులేని అధికారిగా బాధ్యతలు నిర్వహించిన అరవింద రావుకు మంచి గుర్తింపు వుంది. ఇంటిలిజెన్స్ విభాగంలో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుని అందరిని ఆశ్చర్యచితులను చేశారు. అందుకే ఇప్పటి రోశయ్య ప్రభుత్వం అరవింద్ రావును ఏరి కోరి మరి డీజీపీగా నియమించుకుంది. అయితే డిజిపి పదవంటే అశామాసి కాదన్న విషయాన్ని మూడు రోజులకే తెలుస్తుంది. అరవింద్ రావు సత్తాకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల నిర్వహణ వ్యవహారం ఆయన అనుభవానికి సవాల్‌గా మారనున్నది. ఎది ఏమైనా సరే పరీక్షలు నిర్వహించి తీరుతామని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే అందుకు బాధ్యులపై కేసులు నమోదు చేయటానికైనా వెనుకాడేది లేదని అరవిందరావు ఇప్పటికే స్పష్టం చేశారు. శుక్ర, శని వారాలలో పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో, ముఖ్యమంత్రి కె.రోశయ్య తదితర ప్రముఖులందరితో పరీక్షల నిర్వహణపై డీజీపీ సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా తట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
సాధ్యమేనా? దేనికైనా సిద్ధంగా ఉన్నామని డీజీపీ ప్రకటన అయితే చేశారు కానీ క్షేత్ర స్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అంటే అనుమానమే… ప్రతి పరీక్షా కేంద్రం వద్దా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామని డీజీపీ చెబుతుంటే పరీక్షలను జరగనిచ్చేది లేదని, ఎవరైనా హాజరు అయ్యేందుకు ప్రయత్నిస్తే కేంద్రాలలోకి చొరబడి వారి జవాబు పత్రాలను చించి వేస్తామని తెలంగాణ జేఏసీ నేతలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అన్ని విద్యార్థి సంఘాలు ఆదివారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. టీఆర్‌ఎస్, బీజేపీ లాంటి పార్టీలు అందుకు మద్దతు ప్రకటించాయి. పరీక్షలు బహిష్కరించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా పిలుపు ఇచ్చారు. మరోవైపు ఉస్మానియా వర్సిటీ, కాకతీయలో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఉస్మానియా ఆర్ట్స్‌కాలేజీలో నలుగురు విద్యార్థులు ఒక గదిలో దూరి నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి కొందరు విద్యార్థులు కాలేజీ భవనం ఎక్కి ఆందోళన కలిగించారు. జంటనగరాలలో వందకు పైగా కేంద్రాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 445 కేంద్రాలలో ఆదివారం పరీక్ష జరగనుంది. డీజీపీ ప్రకటన మాట ఎలా ఉన్నా కింది స్థాయి పోలీసు అధికారులు మాత్రం ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే ఆందోళనతో ఉన్నారు. విద్యార్థులు శాంతి భధ్రతలను చేతిలోకి తీసుకుంటే తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారవుతుందని, తాము ఏదైనా తీవ్రమైన చర్యలు తీసుకోవలసి వస్తే మళ్ళీ తమనే దోషులుగా నిలబెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయని పోలీసులు ఆందోళనతో ఉన్నారు.




