డోపింగ్‌లో దొరికిన భారత అథ్లెట్లు

డోపింగ్ సెగ భారత్‌కు తాకింది. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ టోర్నీలో దేశానికి పతకాలు సాధించిపెడతారని అనుకున్న అథ్లెట్లు డోపింగ్ పరీక్షల్లో దొరికిపోయారు. వీరిలో షాట్‌పుట్ ఆటగాడు సౌరవ్ విజ్, ఆకాశ్ అంతిల్ ఉన్నారు. ఈ ఇద్దరు గత నెల జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో విఫలమయ్యారని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) గురువారంనాడు ప్రకటించింది. అంతేగాకుండా విచారణ పూర్తయ్యేంత వరకు ఈ ఇద్దరు అథ్లేట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఏఎఫ్‌ఐ కార్యదర్శి రవీందర్ చౌదరీ ఆ ప్రకటనలో తెలిపారు.
గత నెల అగస్టు 5 నుండి 8 వ తేదీ వరకు పటియాలాలో జరిగిన అంతరాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నాడా నిర్వహించిన పరీక్షల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు శాంపిల్లు పాజిటివ్‌గా వచ్చాయని ఆయన అన్నారు. డిల్లీకి చెందిన సౌరవ్ ఇప్పటికే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననున్న అథ్లెటిక్స్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే డోపింగ్ పరీక్షల్లో దొరికిపొవడంతో అతడు తనకు లభించిన అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయాడు. పాటియాలోలో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో 19.91 మీటర్ల దూరం వరకు షాట్‌పుట్‌ను వేసి రెండో స్థానంలో సౌరవ్ నిలిచాడు.




