నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం
ఇది చరిత్రాత్మక ఘట్టం. భారత రాజ్యాంగంలో సరికొత్త అధ్యాయం. భారతీయ మహిళా రాజకీయాల్లో మరో ప్రస్థానం. ఇది శతథా సోనియాదే విజయం. సహస్రథా మహిళాలోకం అభినందనీయం. శత వసంతాల మహిళా దినోత్సవ వేళ మహిళా బిల్లుపై పెద్దల సభలో ‘గద్దలు’ రాద్ధాంతం చేసినా కించిత్ ఆలస్యంగా శత వసంతగానం రవళించింది. తరుణీమణుల హృదయం పల్లవించింది. తరులన్నీ విరిసి మురిసి ప్రజాస్వామ్యం పరిమళించింది.
కొంత వివాదాస్పదమైనా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారంనాడు చోటుచేసుకొన్న అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభ ఆమోదించింది.
బిసీ, మైనారిటీ మహిళలకు రిజర్వేషన్లలో సబ్ కోటా కల్పించాలనే డిమాండ్‌తో సమాజవాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, బిఎస్‌పి వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం కొంత వెనుకంజ వేయాల్సిరావడాన్ని తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా పరిగణించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రాజకీయంగా ఎంతటి ప్రతికూల సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినా మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందితీరాల్సిందేనని పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్యనే మధ్యాహ్నం మూడు గంటలకు బిల్లుపై చర్చను ప్రారంభింపజేసిన ప్రభుత్వ పక్షం అంతిమంగా రాత్రి ఏడున్నర గంటలకు 186–1 వోట్ల భారీ తేడాతో ఎగువ సభ ఆమోదాన్ని పొందగలిగింది.
కొంత వివాదాస్పదమైనా చట్టసభల్లో మహిళలకు 33శాతం స్థానాలను రిజర్వ్ చేసేందుకు ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారంనాడు చోటుచేసుకొన్న అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాజ్యసభ ఆమోదించింది.
బిసీ, మైనారిటీ మహిళలకు రిజర్వేషన్లలో సబ్ కోటా కల్పించాలనే డిమాండ్‌తో సమాజవాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, బిఎస్‌పి వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తుండడంతో మంగళవారం మధ్యాహ్నం కొంత వెనుకంజ వేయాల్సిరావడాన్ని తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా పరిగణించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ రాజకీయంగా ఎంతటి ప్రతికూల సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినా మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందితీరాల్సిందేనని పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్యనే మధ్యాహ్నం మూడు గంటలకు బిల్లుపై చర్చను ప్రారంభింపజేసిన ప్రభుత్వ పక్షం అంతిమంగా రాత్రి ఏడున్నర గంటలకు 186—1 వోట్ల భారీ తేడాతో ఎగువ సభ ఆమోదాన్ని పొందగలిగింది.
దాదాపు రెండేళ్ల క్రితం రాజ్యసభలో ప్రతిపాదించిన ఈ బిల్లుకు ఎగువసభ ఆమోదం లభించడంతో ఒకటి, రెండు రోజుల్లో లోక్‌సభ పరిశీలనకు వెళ్లనున్నది. ఆ తర్వాత దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసన సభలు కూడా ఈ బిల్లును పరిశీలించి ఆమోదించిన తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం ధరించనున్నది. త్రిణమూల్ కాంగ్రెస్ మినహా మిగిలిన పాలక యుపిఎ భాగస్వామ్య పక్షాల సభ్యులతో పాటు బిజెపి, నాలుగు వామపక్ష పార్టీలతో పాటు అన్నా డిఎంకె, తెలుగు దేశం, కొంతమంది జెడి(యు) సభ్యులు బిల్లుకు అనుకూలంగా వోటు చేయగా త్రిణమూల్ కాంగ్రెస్ సబ్యులు గైరుహాజరయ్యారు. బిఎస్‌పి సభ్యులు వాకౌట్ చేసి సభనుండి నిష్క్రమించారు.
ప్రధాన ప్రతిపక్షం బిజెపి, వామపక్ష పార్టీల మద్దతుతో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ లభించడం ఖాయమని తేలినా బిల్లుపై చర్చ, వోటింగ్ నిర్వహించేందుకు నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తున్న ఎస్‌పి, ఆర్జేడీ సభ్యుల అడ్డు తొలగించుకొనేందుకు సోమవారంనాడు సభాధ్యక్షునిపై దాడికి పాల్పడిన ఈ రెండు పార్టీలకు చెందిన ఏడుగురు సభ్యులను ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేయడంతోపాటు ఆ తర్వాత కూడా సభను వదిలివెళ్లడానికి నిరాకరించిన వారిని “మార్షల్స్’ (పార్లమెంట్ భద్రతా సిబ్బంది)తో బలవంతంగా బయటకు గెంటివేయాల్సి వచ్చింది. ప్రస్తుత రూపంలో బిల్లును యధాతథంగా ఆమోదించేందుకు నిరాకరిస్తున్న ఎస్‌పి, ఆర్జేడీ, జెడి(యు) పార్టీల అధ్యక్షులు ములాయంసింగ్ యాదవ్, లాలుప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్‌లతో మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్‌సింగ్ జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో చేయగలిగిందేమీ లేదన్న నిస్సహాయ స్థితిలో పడిన ప్రభుత్వం దాదాపు కాడి కిందపడేసిన దశలో సోనియా గాంధీ జోక్యం చేసుకొని ఏది ఏమైనా ఈరోజే బిల్లును ఆమోదింపజేసి దేశ మహిళా లోకానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రిని, ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పార్లమెంట్ ప్రాంగణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి రాజ్యసభలో బిల్లు ఆమోదానికి దారితీసింది.
యుపిఎ ప్రభుత్వానికి బయటనుండి తోడ్పాటునిస్తున్న సమాజవాదీ పార్టీ, ఆర్జేడీ, బిఎస్‌పి పార్టీలు మద్దతును ఉపసంహరించుకొంటున్నందున ప్రస్తుతానికి బడ్జెట్, ఫైనాన్స్ బిల్లుల గండం నుండి ప్రభుత్వాన్ని బయటపడేసేందుకు అంగీకరించిన ప్రధాన ప్రతిపక్షం-బిజెపితో భవిష్యత్తులో పలు సమస్యలు ఎదురుకాకతప్పదని, యుపిఎ ప్రభుత్వ మనుగడ దినదిన గండంగా మారుతుందన్న ప్రధాని, ఇతర సీనియర్ నాయకుల భయాలు సోనియా నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. లోక్‌సభ, రాజ్యసభలు ఉదయం రెండు పర్యాయాలు అర్థంతరంగా వాయిదా పడిన తర్వాత పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేతల కోర్‌గ్రూప్ సమావేశంలో ముందుముందు యుపిఎ ప్రభుత్వం పతనమైనా సరే ఈరోజు మాత్రం తన నిర్ణయం అమలు జరిగితీరాల్సిందేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది.
ఆ తర్వాత ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ చకచకా పావులు కదిపారు. బిల్లుకు మద్దతు పలికిన బిజెపి, లెఫ్ట్ పార్టీల నాయకులతో ప్రణబ్‌ముఖర్జీ సమావేశమై బిల్లు ఆమోదానికి సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. సోమవారంనాడు రాజ్యసభ ఛైర్మన్ పోడియంపై దాడిచేసి హింసకు పాల్పడడం ద్వారా పార్లమెంట్ ప్రతిష్ఠను, మర్యాదను మంటగలిపారనే ఆరోపణతో ఎస్‌పి, ఆర్జేడీ, ఎల్‌జెపి పార్టీలకు చెందిన ఆరుగురు సభ్యులను, మరో ఇండిపెండెంట్ సభ్యుడిని ప్రస్తుత సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని ఒప్పించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజ్యసభ మూడవ పర్యాయం సమావేశం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పృధ్వీరాజ్ చవాన్‌తో తీర్మానాన్ని ప్రతిపాదింపజేసి సభ ఆమోదాన్ని పొందారు. సస్పెండయిన తర్వాత కూడా సభను వదిలివెళ్లడానికి సుబాష్ యాదవ్ (ఆర్జేడీ), సాబిర్ ఆలీ (లోక్ జనశక్తి), సమాజ్‌వాదీ సభ్యలు వీర్‌పాల్‌సింగ్ యాదవ్, నందకిశషోర్ యాదవ్, అమీర్ అలం ఖాన్, కమల్ అఖ్తర్, ఇండిపెండెంట్ సభ్యుడు ఇజాజ్ ఆలీలు నిరాకరించడంతో సభను రెండు గంటలవరకూ, ఆ తర్వాత మరోసారి మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా వేశారు.
తిరిగి సమావేశమైన తర్వాత బిల్లు వ్యతిరేకుల నినాదాల హోరు కొనసాగుతుండగానే బిల్లు పరిశీలనకు సభ మూజువాణీ ఆమోదాన్ని కోరిన సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుపై వోటింగ్ తీసుకొనేందుకు ప్రయత్నించడంతో వారు మరింత రెచ్చిపోయి మరోసారి సభామధ్యంలోని అధికారుల బల్లపై ఉన్న ఫైళ్లను, పత్రాలను గుంజుకొనే ప్రయత్నం చేశారు. ఒక సభ్యుడు గాజుగ్లాసును కిందపడేసి పగులగొట్టడంతో సభామధ్యంలో అంతా గాజుముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. సభలో ప్రశాంత వాతావరణం లేకుండా, బిల్లుపై అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేసే చర్చకు అవకాశం లేకుండా నేరుగా వోటింగ్ నిర్వహించే వ్యూహాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పిన ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ నాయకత్వంలో బిజెపి సభ్యులు, వామపక్ష పార్టీల సభ్యులు కూడా తమ తమ స్తానాలలో లేచినిలబడి నిరసన తెలియజేయడంతో చర్చకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పడం కోసం సభాధ్యక్షుడు దాదాపు యాభై మందికి పైగా మార్షల్స్‌ను సభలోకి పిలిపించి వెల్‌లో బైఠాయించిన ఏడుగురిని బలవంతంగా బయటకు నెట్టివేయించారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నవారు మళ్లీ ఎలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడకుండా నిరోధించేందుకు మార్షల్స్ సభాధ్యక్షునితోపాటు రాజ్యసభ సెక్రటరీ జనరల్, ఇతర అధికారుల స్థానాల చుట్టూ వలయంగా నిలబడి భారీ భద్రత కల్పించారు.
చర్చ లేకుండా బిల్లును ఆమోదించేందుకు బిజెపి, లెఫ్ట్ ససేమిరా అనడంతో అప్పటికే ప్రారంభించిన వోటింగ్ ప్రక్రియను నిలిపివేసి ఛైర్మన్ హమీద్ అన్సారీ చర్చను అనుమతించారు. తమ సహచరులు ఏడుగురిని బలవంతంగా సభనుండి గెంటివేయడం, బిల్లును ఆమోదింపజేసుకొనేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో ఈ పార్టీలకు చెందిన మిగిలిన సభ్యులు కూడా సభనుంచి నిష్క్రమించడంతో దాదాపు మూడు గంటలసేపు చర్చ కొనసాగింది. బిఎస్‌పి సభ్యులంతా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోగా నిరసన తెలుపుతున్న సబ్యులను సస్పెండ్ చేయడం, మార్షల్స్‌తో గెంటించడం అప్రజాస్వామికమని తప్పుబట్టిన యుపిఎ భాగస్వామ్యపక్షమైన త్రిణమూల్ కాంగ్రెస్ సభ్యులిద్దరు సభకు గైరుహాజరయ్యారు. బెంగాల్‌లో తన బద్ధశత్రువులైన వామపక్షాల మద్దతు స్వీకరించడంపై రైల్వే మంత్రి కుమారి మమతా బెనర్జీ అభ్యంతరాలను ఖాతరు చేయనవసరం లేదని కూడా సోనియా గాంధీ అభిప్రాయపడడంతో ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయలేదు.
సాయంత్రం ఆరున్నర గంటల వరకూ జరిగిన చర్చలో ప్రధాని మన్మోహన్‌సింగ్, ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, సిపిఎం నేత శ్రీమతి బృందా కారత్, కాంగ్రెస్ నాయకురాలు జయంతి నటరాజన్, సిపిఐ పక్ష నాయకుడు డి.రాజాలతో పాటు మొత్తం 27మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుపై చర్చకు న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ క్లుప్తంగా సమాధానమిచ్చిన తర్వాత 6.40 గంటలకు ప్రారంభమైన వోటింగ్ ప్రక్రియ 7.25 గంటల వరకూ సాగింది. బిల్లుకు అనుకూలంగా 186 వోట్లు లభించగా కేవలం ఒకే ఒక సభ్యుడు వ్యతిరేకించారు. సభకు హాజరైన వారిలో ఎవరూ వోటింగ్‌లో పాల్గొనకుండా గైరుహాజరు కాలేదు.
ప్రధానితో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ప్రకటించిన ములాయంసింగ్ యాదవ్, లాలుప్రసాద్ యాదవ్‌లు ఉదయం పదకొండున్నరకు లోక్‌సభ వాయిదా పడిన తర్వాత కూడా సభలోనే కూర్చొన్న సోనియా గాంధీ వద్దకు వెళ్లి దాదాపు ఇరవై నిముషాలసేపు చర్చించారు. వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్న తమ డిమాండ్‌ను పరిశీలించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. అయితే, అఖిలపక్షం అవసరం లేదని, యధాతథంగా బిల్లును ఆమోదించిన తర్వాతే బిసి మహిళల అంశాన్ని పరిశీలిస్తామని ఆమె వారికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. వారు కూడా తమ వైఖరిని ఏమాత్రం సడలించుకోకపోవడంతో ఆ తర్వాత జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో సోనియా గాంధీ ఏది అడ్డువచ్చినా వెన్నుచూపే సమస్యే లేదన్న కీలక నిర్ణయం తీసుకొన్నారు.
ఉదయం పదకొండు గంటలకు లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే ములాయంసింగ్ యాదవ్, లాలుప్రసాద్ యాదవ్‌లతో సహా ఎస్పీ, ఆర్జేడీ, జెడి(యు) సభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి ఆందోళనను సాగిస్తుండడంతో స్పీకర్ మీరాకుమార్ తొలుత ఇరవై అయిదు నిమిషాలు, ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు గంట గంట చొప్పున వాయిదా వేసి పరిస్థితిలో మార్పు లేకపోవడంతో చివరగా సాయంత్రం నాలుగు గంటలకు బుధవారానికి వాయిదా వేశారు.
——————————–



మహిళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సమాచార, టూరిజం శాఖ మంత్రి గీతా రెడ్డికి స్వీటు తినిపించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుతున్న సియం రోశయ్య, డి.కె.అరుణ




