నా గెలుపును ఎవ్వరు ఆపలేరు – డీఎస్

12 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ బంగారు పల్లెంలోపెట్టి తీసుకువస్తామని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సదానంద్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సెంటిమెంట్ ఎవడబ్బ సొత్తు కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతాడని విమర్శించారు. కత్తిడాలు లేకుండా యుద్దం ఎలా చే స్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో తీర్మాణాలు చేసి చట్టం తీసుకువచ్చాకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని దీనికి రాజకీయ పరిష్కారం అవుసరమని చెప్పారు. రాజీనామాకు నేను వ్యత రికేమని, ఇన్ని సార్లు రాజీనామా చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. అసెంబ్లీలో లేకుండా ఉండడం తప్పేనని చెప్పారు. తాను 800 కోట్లతో నిజామాబాద్ అభివృద్ది చేశానని ప్రత్యర్థులు కేవలం విమర్శల కోసం అభివృద్ది చేయలేదని చెబుతున్నారని చెప్పారు. అభివృద్ది తెలంగాణ కోసం పాటుపడుతానని, పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇవన్ని చేయగలనని ప్రజలను నన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపుపై ఎలాంటి సందేహాం లేదని ప్రజలే ఘన విజయం అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.




