నిరవధిక వాయిదా పడ్డ లోక్‌సభ

indianparliamentలోక్ సభ శుక్రవారం మధ్యాహ్నం నిరవధికంగా వాయిదా పడింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ అంశం సభను తీవ్రంగా కుదిపేసింది. శీతాకాల సమావేశాల చివరి రోజైనప్పటికీ తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. శుక్రవారం సభ ప్రారంభం అయినప్పటి నుంచీ ఇరువర్గాలుగా విడిపోయిన ఆంధ్ర ఎంపిలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సభా కార్యక్రమాలు కొనసాగనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆంధ్ర ఎంపీలు సృష్టిస్తున్న గందరగోళం మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. చివరికి వారి ఆందోళనలు, నిరసనల మధ్యే సభను నిరవధికంగా వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న ప్రకటించినప్పటి నుంచీ లోక్ సభలోని ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రతిరోజూ వారు సభలో తెలంగాణ, సమైక్యాంధ్రలకు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. స్పీకర్ పోడియంను ఇరు వర్గాల ఎమ్మెల్యేలూ చుట్టుముట్టి సభా కార్యక్రమాలను తీవ్రంగా ఆటంకపరిచారు. తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలు లోక్ సభను గత కొద్ది రోజులుగా దద్దరిల్లజేశాయి.  సభను నిరవధికంగా వాయిదా వేసిన సందర్భంగా లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సమస్య ప్రజాస్వామ్యయుతంగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ అంశంపై సభ పలుమార్లు వాయిదా పడడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య త్వరగా సమసిపోవాలని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అభిలషించారు. దేశ ప్రజలకు ఆమె క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  ఇలా ఉండగా, ఉపా చైర్ పర్సన్ లోక్ సభ శీతాకాల సమావేశాల తొలిరోజున, చివరి రోజున హాజరు కావడం విశేషం.

Leave a Reply

free website analytics