నిలకడగా రోశయ్య ఆరోగ్యం – పునరంకిత సభ వాయిదా

గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం తెలిపింది. జ్వరం తగ్గినా నీరసంగా ఉండడంతో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో సాయంత్రం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం, రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించ తలపెట్టిన పునరంకిత సభ వాయిదా పడ్డాయి. ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్బంగా గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ సారధ్యంలో శుక్రవారం పిపుల్స్ ప్లాజాలో సిఎం రోశయ్యకు ఘన సన్మానానికి సన్నాహాలు పూర్తి చేశారు. గురువారం నిమ్స్‌లో ప్రతి గంటకోసారి ముఖ్యమంత్రి రోశయ్య ఆరోగ్యాన్ని పరీక్షించిన గుండె, ఛాతి వైద్య నిపుణులు ఇది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమేనని గుర్తించారు. రక్త నమూనాల పరీక్షా నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి పి.వి.రమేష్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాదరావు గురువారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్యకు జ్వరం తగ్గిందన్నారు. అయినా రెండు, మూడు రోజులపాటు పూర్తిగా విశ్రాంతి అవసరమన్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని తాము సూచించామని పేర్కొన్నారు. గురువారం ఉదయం లేచి నడవలేని పరిస్థితిలో ఉన్న రోశయ్య సాయంత్రం గాంధీభవన్‌లో జరిగిన దివంగత వైఎస్ ప్రథమ వర్థంతి సభకు హాజరయ్యారు.




