నెల్లూరు మేయర్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

10-3slider6
పదవులను అడ్డంపెట్టుకుని ‘బాగా మేశార’ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు మేయర్ భానుశ్రీ ఆస్తులపై ఏసీబీ దాడులు జరిపింది. నెల్లూరు, హైదరాబాద్ నగరాల్లో భానుశ్రీతోపాటు ఆమె అనుచరులు, సోదరులు, బంధువుల ఇళ్లలో మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపారు. సుమారు కోటి రూపాయల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ట్రాన్స్‌కోలో డీఈగా పనిచేస్తున్న మేయర్ భర్త సుబ్బరాజును అరెస్ట్‌చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.  తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటూ ఆమె షిరిడీ సాయిబాబా ఆలయంలో హారతిపై ప్రమాణం కూడా చేశారు. మరుక్షణమే… కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మేయర్ అక్రమాలు నిజమేనంటూ కొన్ని డాక్యుమెంట్లతో కూడిన పోస్టర్లను ‘రాజీవ్ భవన్’ వద్ద ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే భానుశ్రీ ఆస్తులపై ఏసీబీ దాడులు జరగడం గమనార్హం. భానుశ్రీ భర్త సుబ్బరాజుకు నెల్లూరులో రెండు ఇళ్లు, 18 ప్లాట్లు, 6.33 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు.  నెల్లూరు, హైదరాబాద్, చిత్తూరు, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఉన్న ఆస్తుల విలువ రూ.6 1.3లక్షలుగా ఏసీబీ అధికారులు లెక్కించారు. దీంతోపాటు ఒక మారుతీ స్విఫ్ట్, ఒక స్కార్పియో, ఒక మోటా ర్ సైకిల్, లక్ష రూపాయల నగదు, 367.210 గ్రాముల బం గారు కనుగొన్నారు. బ్యాంకు ఖాతాల్లో రూ.2.62 లక్షల నిల్వ ఉన్నట్లు గుర్తించారు. రూ.3.67 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎల్ఐసీలో రూ.6.32 లక్షల పె ట్టుబడి, ఇతర చరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
పక్కా వ్యూహంతో ఏసీబీ దాడులు
మేయర్ భానుశ్రీ ఆస్తులపై ఏసీబీ అధికారులు పక్కావ్యూహంతో దాడులు చేశారు. జిల్లాలోని గూడూరు ప్రాంతంలో సెజ్‌ల అక్రమాలపై విచారణకు పైఅధికారులు వస్తున్నట్లు ఇక్కడి ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. అధికారులు దీనికి సమాయత్తమవుతుండగా… కథ అనుకోని మలుపు తిరిగింది. మేయర్ ఆస్తులపై దాడులు చేస్తున్నట్టు అప్పటికప్పుడు రాష్ట్రస్థాయి అధికారులు సమాచారం ఇచ్చారు. ఉదయం ఆరు గంటలకే సోదాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఏసీబీ అధికారులు సాంకేతిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. భానుశ్రీ ప్రజా ప్రతినిధి కావడంతో, ఆమె భర్త శివసుబ్బరాజును లక్ష్యంగా ఎంచుకున్నారు.
ట్రాన్స్‌కోలో డీఈగా పనిచేస్తున్న సుబ్బరాజు కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న సమాచారంపై దాడులు చేస్తున్నట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో మేయర్ బంధువులు రమణరాజు, సులోచనలతోపాటు వ్యాపార లావాదేవీల్లో భాగస్వామిగా ఉన్న అమానుల్లాఖాన్ ఇళ్లలోనూ సోదాలు జరిపారు. భానుశ్రీ సమీప బంధువుల్లో మరికొందరి ఇళ్లకు వెళ్లినా… తాళాలు వెక్కిరించాయి. దీంతో అధికారులు వెనుదిరిగారు. అధికారికంగా సుబ్బరాజు పేరు చెబుతున్నా… ఏసీబీ గురి మాత్రం మేయర్ భాను శ్రీ అనే తెలుస్తోంది. సోదాలు జరుగుతున్నంత సేపు కాంగ్రెస్‌లోని ఒక వర్గంలో హర్షాతిరేకం కనిపించింది.
అది సక్రమ సంపాదనే: భానుశ్రీ
తమకున్న ఆస్తులన్నీ సక్రమంగా సంపాదించుకున్నవేనని భానుశ్రీ పునరుద్ఘాటించారు. ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. “నా భర్త నెల జీతం రూ.65 వేలు. ఆయన తల్లికి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మేం ఉన్న ఇంటిని మా మామ కట్టించారు. నా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని పదేపదే ఇబ్బంది పెడుతున్న వారికి తగిన శాస్తి జరుగుతుంది. తగిన గుణపాఠం జరిగి తీరుతుంది” అని శపించారు. అవినీతి ఆరోపణలు, ఏసీబీ దాడులు తమను తీవ్రంగా కలిచివేశాయని కన్నీరు పెట్టారు. తనపై ఉన్న అక్కసుతో మొత్తం కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వాపోయారు.

Leave a Reply

free website analytics