నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

intermediateఉదయం 6 గంటలకు ప్రశ్నాపత్రం సెట్ డ్రా
ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పరీక్ష
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం ఇంటర్ బోర్డు 3 రకాల ప్రశ్నాపత్రాల సెట్లను తయారు చేయగా, వాటిల్లో ఒక సెట్‌ను లాటరీ ద్వారా ఉదయం 6 గంటలకు డ్రా తీస్తారు. అయితే హాజరు తక్కువగా ఉం దన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 వేల మంది విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించారు. వీరిలో తెలంగాణ ప్రాంత విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నట్టు సమాచారం.  నిబంధనల ప్రకారం ఇంటర్ పరీక్షలు రాయడానికి 75 శాతం హాజరు ఉండాలి. కనీసం 60 శాతం హాజరు ఉన్నా హాల్ టిక్కెట్లు ఇవ్వాలని ఇంటర్ బోర్డు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 60 శాతం కూడా లేని విద్యార్థుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల వరకు ఉండవచ్చని అంచనా. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుండటంతో హాజరు విషయంలో ఒకింత సడలింపు ధోరణితో ఉండాలని ఇంటర్ బోర్డు ఆఖరు నిమిషంలో మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని చోట్ల 50శాతం హాజరు ఉన్న విద్యార్థులకు కూడా హాల్‌టిక్కెట్లు ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ ఇంకా దాదాపు 6 వేల మంది హాల్ టికెట్లకు నోచుకోలేదని తెలుస్తోంది.  వీరందరూ 30 శాతం లోపు హాజరు ఉన్న విద్యార్థులేనని అధికారులు చెబుతున్నారు. ఈ విషయం పలు జిల్లాల్లో వివాదానికి దారితీస్తున్నట్లు సమాచారం. ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300లకు పైగా పరీక్షా కేంద్రాల్లో బెంచీలు ఏర్పాటు చేయలేదు. ఆ కేంద్రాల్లో విద్యార్థులు నేల మీద కూర్చొనే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రైవేటు కాలేజీలలో బెంచీలు ఉన్నాయని, ప్రభుత్వ కాలేజీల్లోనే ఈ పరిస్థితి ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి జి. బలరామయ్య ‘ఆన్‌లైన్’ తో చెప్పారు.

Leave a Reply

free website analytics