నేడు అఖిలపక్షం – ఢిల్లీకి చేరుకున్న రాష్ట్ర నేతలు

ponnala00
గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టుపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ సమక్షంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నరసారెడ్డి హాజరుకానున్నారు.  టీడీపీ తరఫున చంద్రబాబునాయుడు, పీఆర్పీ తరఫున చిరంజీవి, టీఆర్ఎస్ నుంచి వినోద్‌కుమార్, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి కె. నారాయణ, బీజేపీ నుంచి జి.కిషన్‌రెడ్డి, లోక్‌సత్తా నుంచి జయప్రకాశ్ నారాయణ, ఎంఐఎం తరఫున మహమ్మద్ పాషా ఖాద్రి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ చేరుకోగా.. చిరంజీవి సోమవారం ఉదయం వెళ్లనున్నారు.  ఇక, నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ లో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం ఏపీ భవన్‌లోనే విశ్రాంతి తీసుకుని.. అనంతరం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. హైదరాబాద్‌లోనూ మెట్రో ప్రాజెక్టును చేపట్టనున్న నేపథ్యంలో దానిలోని సాధకబాధకాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన కేంద్ర సామాజిక సంక్షేమ మంత్రి ముకుల్ వాస్నిక్‌ను కలుసుకున్నారు.  కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీలు టి.సుబ్బిరామిరెడ్డి, వి.హనుమంతరావులు సీఎంతో భేటీ అయ్యారు. మాజీ ఎంపీ గిరీశ్ సంఘీ నివాసంలో ఏర్పాటు చేసిన రాత్రి విందుకు రోశయ్య హాజరైనట్లు తెలిసింది. మరోపక్క, ఆదివారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్, ఆర్ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌లతో భేటీ అయ్యారు.  ఇటీవల బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మహారాష్ట్రలో జరిగిన పరిణామాలను, బాబ్లీపై ఆ రాష్ట్రం చేస్తున్న అన్యాయాన్ని వారికి వివరించారు. దిగువ రాష్ట్రాలకు ఎగువ రాష్ట్రాలు చేస్తున్న అన్యాయంపై జాతీయస్థాయి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారికి వివరించారు. తెలంగాణలో ఉప ఎన్నికల కంటే బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర రాష్ట్ర తమ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం ముఖ్యమైనదని, అందుకే తాము దానిపై దృష్టి సారించామని చెప్పారు.  సోమవారంనాటి అఖిలపక్షంలో గోదావరిపై బాబ్లీతోపాటు మహారాష్ట్ర నిర్మిస్తున్న 13 ప్రాజెక్టుల గురించి కూడా చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారు. బాబ్లీ సందర్శనకు వెళ్లిన తమ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన వైఖరిని ఎండగట్టనున్నారు. బాబ్లీ గేట్లు పెట్టి ఉంటే వాటిని పగల గొట్టించాలని ప్రధానిని డిమాండ్ చేయనున్నారు. ప్రభుత్వం కూడా దీటుగా స్పందించేందుకు సిద్ధపడుతోంది.

Leave a Reply

free website analytics