చిరిగిన చొక్కాలతో నేతలు – బాబు బృందానికి ఘన స్వాగతం

ఓ వైపు జోరుగా కురుస్తున్న వర్షం.. మరోవైపు కార్యకర్తల్లో పొర్లుకొస్తున్న ఉద్వేగం! బంధువులు, కుటుంబ సభ్యుల ఎదురు చూపులు! ఆప్తుల ఆలింగనాలు! మొత్తంగా ఉద్విగ్న వాతావరణం!! మరోవైపు చంద్రబాబుకు అనుకూలంగా, మహారాష్ట్ర, రోశయ్య సర్కారులకు వ్యతిరేకంగా మిన్నుముట్టిన నినాదాలు! రెపరెపలాడిన టీడీపీ పతాకాలు! ఇవీ.. రాత్రి తొమ్మిదిన్నర నుంచి 11 గంటల మధ్యలో శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు!
ఔరంగాబాద్ నుంచి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు మంగళవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుమారు వంద గంటల పాటు నరకయాతన, ఔరంగాబాద్‌లో బలవంతంగా విమానం ఎక్కించి పంపిన నేపథ్యంలో నేతలకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న చంద్రబాబును చూసేందుకు పార్టీ శ్రేణులు పోటీ పడ్డాయి. పార్టీ పతాకాలను రెపరెపలాడించాయి.
మహారాష్ట్రకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. చేతకాని రోశయ్య సర్కారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాబుకు స్వాగతం చెప్పేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి, వారి కుమారుడు లోకేశ్ కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. పార్టీ సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్‌జాన్‌బాషా, కంభంపాటి రామ్మోహన్ రావు, నాగం జనార్దన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, దశరధ రామారావు, దాడి వీరభద్రరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు విమానాశ్రయం వద్ద నేతలకు స్వా గతం పలికారు.
యనమల, పయ్యావుల, తీగల తదితర నేతల కుటుంబ సభ్యులు సైతం విమానాశ్రయంలో గంటకు పైగా వేచి చూశారు. చంద్రబాబుతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను చూసి కార్యకర్తలు, నేతలు ఉద్వేగానికి లోనయ్యారు. కొందరైతే కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తమకు ఎదురేగి స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తల అభిమానంతో తడిసి ముద్దయిన చంద్రబాబు, ఇతర నేతలకు ఉద్విగ్నతతో కొంతసేపు నోటమాట రాలేదు. వర్షం కురుస్తున్నప్పటికీ కార్యకర్తలు లెక్కచేయలేదు.
10-15 గంటలకు విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు బృందం వెలుపలికి రాగానే కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఔరంగాబాద్ నుంచి వచ్చిన బృందంలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు డయేరియాతో బాధపడుతుండడంతోపాటు మరో 10 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో విమానాశ్రయం వద్ద ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నాలుగు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. శంషాబాద్‌కు చేరుకున్న టీడీపీ నేతల బృందంలో కొందరు ఎమ్మెల్యేలు చొక్కాలు చిరిగిపోయి, చెప్పుల్లేకుండా కనిపించారు.
వీల్‌చైర్‌లలో ఎమ్మెల్యేలు
విమానాశ్రయానికి చేరుకున్న నేతల బృందంలో వెంకటగిరి, మాడుగుల, ముథోల్, హిందుపురం ఎమ్మెల్యేలు కోరుకొండ రామకృష్ణ, రామునాయుడు, వేణుగోపాలాచారి, అబ్దుల్ ఘనీ వీల్‌చైర్‌లో బయటికి వచ్చారు. ఎమ్మెల్యేలు శివరామరాజు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, మీనాక్షినాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు చిరిగిన చొక్కాలతో ఉన్నారు. ఎర్రబెల్లి, అశోక్ నీరసంగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఎంపీ నామా నాగేశ్వరరావు దుస్తులు కూడా చిరిగి ఉన్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేస్తూ ముందుకు కదలారు.
- నేను ఇంకా చనిపోలేదు – ఇక తాడో పేడో తేల్చుకుంటా – చంద్రబాబు

నేను ఇంకా చనిపోలేదు. మహారాష్ట్ర పోలీసులు ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నన్ను ఇంకా ఎంత హింసిస్తారో తెలియదు. నా రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితులను నేను ఎన్నడూ చూడలేదు. భవిష్యత్తులో ఇటువంటి నిరంకుశమైన పరిస్థితులను మళ్లీ చూస్తానని అనుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుఅన్నారు. మహారాష్ట్ర పోలీసులు మంగళవారం ఉదయం చంద్రబాబు బృందాన్ని ధర్మాబాద్ నుంచి బలవంతంగా వాహనాలలోకి ఎక్కిస్తున్న సందర్భంలో వారిపై లాఠీ ఛార్జి జరిగిన అనంతరం ఫోన్లో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వ దమననీతికి అడ్డూ ఆపూ లేకుండా పోయిందని అన్నారు. ఆయన ఎన్నడూ లేనంతగా ఆవేదనకు లోనయ్యారు. ఏది ఏమైనా బాబ్లీపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడా తేల్చుకునేవరకూ ఇక్కడనుంచి కదిలేది లేదని బాబు స్పష్టం చేశారు. నేనొక మాజీ ముఖ్యమంత్రినని కూడా చూడకుండా మహారాష్ట్ర పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లు, మహిళలు అని కూడా చూడడంలేదు. ఇది చాలా దారుణం అని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై మంగళవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడుకు గాని, ఆయనతోపాటు ఉన్న మిగిలిన వారిలో ఎవరికి గాని ఏం జరిగినా అందుకు ప్రభుత్వాలదే బాధ్యత అని ఆమె మండిపడ్డారు.
రాజకీయ వ్యవహారాలపై తొలిసారిగా స్పందించిన భువనేశ్వరి మంగళవారం సాయంత్రం ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన విషయం తెలిసి రాష్ట్రంలో పెక్కుమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





